Chiranjeevi: కపిలేశ్వరపురంలో జీఎస్ఎల్-సూర్య హెల్త్ కేర్ సెంటర్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఆరోగ్యం, క్యాన్సర్‌పై అవగాహన, ప్లాస్టిక్ వినియోగంతో కలిగే ముప్పుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై పలు వ్యాఖ్యలు చేశారు.
తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘గోదావరి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. వయసు అంటే ఒక నంబర్ మాత్రమే. అభిమానుల ప్రేమ వల్ల నాకు ఎనర్జీ వస్తుంది. మీ ప్రేమ, అభిమానం నాకు ఇంజిన్‌లా పనిచేస్తాయి’’ అని పేర్కొన్నారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి తాను అభిమానినని చిరంజీవి తెలిపారు. ఆయన చెప్పే ఆరోగ్య సూచనలను పాటిస్తూ తాను జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు.
క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ వ్యాధిపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్ అంటే భయపడకుండా ముందస్తు పరీక్షలు, నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. పాన్ పరాగ్, గుట్కా, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదన్నారు. తన కుటుంబ సభ్యులకు బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన మామోగ్రామ్ పరీక్షలు చేయిస్తుంటానని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు చిన్నారులకు సంబంధిత వ్యాక్సిన్ వేయించడంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
మరోవైపు ప్లాస్టిక్ వినియోగంపై కూడా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్టిక్ మానవాళికి పెను ముప్పుగా మారిందని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మానవ శరీరానికి ప్రమాదం కలుగుతుందని చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. తాను గాజు గ్లాసులోని నీటినే తాగుతానని, ఇందుకోసం హైదరాబాద్ నుంచి కూడా ఏర్పాట్లు చేసుకుని వచ్చినట్లు తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి గురించి కూడా చిరంజీవి స్పందించారు. తాను ఏపీకి వచ్చి చాలా రోజులైందని, గతానికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోందన్నారు. రోడ్ల పరిస్థితిలో మార్పు కనిపిస్తోందని, నెమ్మదిగా అన్నీ బాగుపడుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ గతంలో 23వ స్థానంలో ఉండగా ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు.

