Site icon NTV Telugu

Chiranjeevi: 72 మందితో చిరు భేటీ.. సమ్మెకు ముగింపు?

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దను కాదని, తాను కూడా సినీ పరిశ్రమలో ఒకడినేనని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, సినీ పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళుతుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో వేతనాలు పెంచాలని ఫెడరేషన్ మొదలుపెట్టిన సమ్మె మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సుమారు రెండు వారాల నుంచి కొనసాగుతున్న సమ్మెకు ఒక బ్రేక్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు.

నిన్న మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఒక కీలకమైన సమావేశం నిర్వహించారు. అందులో 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటలపాటు నిర్వహించిన ఈ సమావేశంలో, ఒక సెలబ్రిటీగా లేదా హీరోగా కాకుండా సినీ పరిశ్రమలో ఒకరిగా ఆయన అన్ని సమస్యలను విని నోట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరినీ మాట్లాడించే అవకాశం ఇచ్చిన ఆయన, తనకు వచ్చిన అనుమానాలను వారితోనే నివృత్తి చేసుకున్నట్లు సమాచారం.

Also Read: Miss Universe India 2025: ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా’గా మణిక విశ్వకర్మ!

అలాగే ఫెడరేషన్ కార్మికులు, నిర్మాతల మధ్య దూరం ఎందుకు పెరిగింది అనే విషయం మీద కూడా ఆయన ఈ సమావేశంలో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాక, కార్మికులను కూడా గౌరవంతో చూసినప్పుడే సినీ పరిశ్రమలో మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. నిన్న 24 క్రాఫ్ట్స్ నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులతో దాదాపుగా ఆయన ముఖాముఖి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే విషయం ఆ 72 మంది దాదాపుగా వివరించినట్లుగా సమాచారం. ఇక ఈరోజు,రేపటిలో ఈ సమ్మెకు ఒక ముగింపు పలికే దిశగా మెగాస్టార్ చిరంజీవి ఫెడరేషన్ నాయకులతో పాటు నిర్మాతలతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి ఏం చెప్పినా చేసేందుకు సిద్ధమని ఇప్పటికే ఫెడరేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు త్వరలోనే ముగింపు దొరికే అవకాశం ఉంది.

Exit mobile version