Site icon NTV Telugu

KrishnamRaju: కృష్ణంరాజు మృతికి మెగాబ్రదర్స్ తీవ్ర సంతాపం

Chiranjeevi

Chiranjeevi

రెబల్ స్టార్ కృష్ఱంరాజు హఠాన్మరణం తెలుగు సినీ ప్రముఖుల్ని తీవ్ర విషాదంలో నింపేసింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకి చెందిన కృష్ణంరాజు మరణంపై ఎమోషన్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనది కూడా మొగల్తూరే కావడం విశేషం. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు మిత్రులు తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కయ్యారు. శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్న లా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారి తో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రి గా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కీ, నా సంతాపం తెలియచేసుకుంటున్నా అని సంతాపం తెలిపారు.

Read Also: KrishnamRaju: మంచితనానికి మారు పేరు ఎవర్‌ గ్రీన్‌ రెబల్‌ స్టార్‌ (Ws)

ఇటు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. శ్రీ కృష్ణంరాజు గారి మరణం దిగ్బ్రాంతికరం అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

మా కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో శ్రీ కృష్ణంరాజు గారితో కలసి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి.

ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

Read Also: Yogi Adityanath: 15 మంది అధికారులను సస్పెండ్ చేసిన సీఎం యోగీ ఆదిత్యనాథ్

Exit mobile version