NTV Telugu Site icon

Taiwan President: చూస్తూ ఊరుకోబోం.. తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు

Taiwan

Taiwan

Taiwan President: యూఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీని కలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా బెదిరించినప్పటికీ దౌత్యపరమైన ఒప్పందాల కోసం తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ న్యూయార్క్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ అంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో అగ్రరాజ్యం అమెరికాతో చర్చిస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా హెచ్చరించింది. అంతేకాదు.. పర్యటనకు ముందు సాయ్‌ చేసిన వ్యాఖ్యలను ధిక్కార స్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ పర్యటనకు ముందు మాట్లాడుతూ.. తైవాన్‌కు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు ఈ మేరకు ఎలాంటి ప్రభావం తమపై చూపలేరంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆమె మధ్యలో కాలిఫోర్నియాను సందర్శించాల్సి ఉండగా.. యూఎస్‌ హౌజ్‌ స్పీకర్‌ కెవిన్‌ మెక్‌కార్తీతో భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అయితే.. ఈ భేటీ పరిణామంపై డ్రాగన్‌ కంట్రీ తీవ్రంగా స్పందించింది.

Read Also: Rahul Gandhi: రాహుల్‌ అనర్హతపై స్పందించిన జర్మనీ.. ఏమందంటే?

గత ఏడాది ఆగస్టులో అప్పటి యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ద్వీపాన్ని సందర్శించిన తర్వాత తైవాన్ అధ్యక్షురాలి అమెరికా పర్యటన వచ్చింది. నాన్సీ పెలోసి 25 సంవత్సరాలలో తైవాన్‌ను సందర్శించిన అత్యున్నత స్థాయి ఎన్నికైన యూఎస్ అధికారి అయ్యారు. ఆమె పర్యటన అనంతరం తైవాన్‌ ద్వీపం చుట్టూ చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. పెలోసి పర్యటనకు వ్యతిరేకంగా చైనా పలు హెచ్చరికలు చేసింది.

తైవాన్ అధ్యక్షురాలు అమెరికా చట్టసభ స్పీకర్‌ను కలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇది చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంశంగా భావించక తప్పదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ అన్నారు. తైవాన్‌ అధ్యక్షురాలు మెక్‌కార్తీని కలిస్తే.. హౌస్ స్పీకర్, తైవాన్ నాయకుడి మధ్య యూఎస్ గడ్డపై ఇది మొదటి సమావేశం అవుతుంది. ఈ ఆలోచన చైనాకు కోపం తెప్పిస్తోంది. ఈ సమావేశం వాస్తవానికి లాస్ ఏంజెల్స్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో జరగాలని నిర్ణయించారు, అయితే లైబ్రరీ ఇంకా సమావేశాన్ని ధృవీకరించలేదు.