Site icon NTV Telugu

Xi Jinping: యుద్ధం కోసమా? ఉద్వాసన కోసమా? జిన్‌పింగ్ సైన్యంలో మేజర్ సర్జరీ వెనక కారణాలు ఇవేనా!

Xi Jinping

Xi Jinping

Xi Jinping: ఇటీవల కాలంలో చైనా సైన్యంలో జరిగిన పలు మేజర్ సర్జరీలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. డ్రాగన్ సైన్యంలో అత్యంత సీనియర్ జనరల్ అయిన జాంగ్ యూక్సియాను తన పదవి నుంచి చైనా నాయకత్వం తొలగించిన విషయం తెలిసిందే. జాంగ్‌పై అవినీతి, రాజద్రోహం ఆరోపణలు రావడంతో చైనా పాలకవర్గం ఆయనను తన పదవి నుంచి తప్పించింది. నిజానికి 2023 నుంచి అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తొలగించిన 81వ సైనిక అధికారి జాంగ్. చైనా సైన్యం నుంచి గత మూడు సంవత్సరాలలో 80 మంది ఉన్నత స్థాయి అధికారులను తొలగించారు, వారిలో ఇద్దరు ఉపాధ్యక్ష పదవులను నిర్వహించారు. జాంగ్‌తో పాటు, వీడాంగ్‌ను కూడా గత సంవత్సరం పదవి నుంచి తొలగించారు. నిజానికి ఇటీవల కాలంలో బీజింగ్‌లో ప్రతి 10 రోజులకు ఒక సైనిక అధికారిని తొలగిస్తున్నారు. చైనాలో ఇది ఎందుకు జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

READ ALSO: Ursula von der Leyen: భారత్ విజయం ప్రపంచానికి లాభం.. ఈయూ చీఫ్ ప్రశంసలు..

2023లో స్టార్ట్ అయిన తొలగింపులు..
2020లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఒక కఠినమైన సందేశాన్ని జారీ చేశారు. అవినీతి లేకుండా చూసుకోవలని ఆయన తన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2023లో చైనా ఆయుధాలు తగినంత శక్తివంతమైనవి కాదని పేర్కొంటూ ఒక నివేదిక విడుదలైంది. చైనాలో ఆయుధ తయారీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఈ నివేదికల తర్వాత చైనా సైనిక అధికారులపై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. కేవలం ఒక ఏడాదిలోనే, చైనా మిలిటరీ కమిషన్‌లోని టాప్ ఏడుగురు అధికారులలో ఆరుగురుని తొలగించారు. వీరిలో ఇద్దరు అధికారులు వైస్-ఛైర్మన్ పదవిలో ఉన్నారు. చైనా అధ్యక్షుడు సైన్యానికి ఎక్స్-అఫిషియో అధిపతి. గత మూడు సంవత్సరాలలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో 80 మంది సీనియర్ సైనిక అధికారులను తొలగించారు. వీరిలో నలుగురికి మరణశిక్షను కూడా విధించారు. అలాగే గత మూడు సంవత్సరాలలో చైనాలో 15 వేల మంది అధికారులను అరెస్టు చేశారు. ఈ అధికారులలో ఎక్కువ మంది సైనిక వ్యవహారాలకు సంబంధించినవారే ఉన్నారు. జి జిన్‌పింగ్ అధ్యక్షుడైనప్పటి నుంచి అవినీతి ఆరోపణలపై 1 మిలియన్ అధికారులను అరెస్టు చేసినట్లు చైనా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డేటా వెల్లడించింది.

ఈ అరెస్ట్‌లకు కారణాలు ఇవేనా..
1. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం.. చైనా సైన్యంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. అందుకే 2024లో ప్రపంచ ఆయుధ అమ్మకాలు పెరిగినప్పటికీ, చైనా ఆయుధ అమ్మకాలు తగ్గాయి. ఇది చైనాకు పెద్ద ఎదురుదెబ్బ.

2. జి జిన్‌పింగ్ సీనియర్ పదవులకు తన విధేయులను నియమిస్తున్నారు. సరిగ్గా పని చేయని అధికారులను తొలగిస్తామని చెప్పి, ఆయన తన విధేయులను ఆయా స్థానాల్లో నియమిస్తున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి ప్రక్షాళన అనే పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.

3. CIA కార్యకలాపాల గురించి కూడా చైనా ఆందోళన చెందుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం.. జాంగ్ అమెరికాకు అణ్వాయుధ నిఘా సమాచారాన్ని అందించాడని ఆరోపణలు ఉన్నాయి. 2010లో కూడా చైనా అమెరికా గురించి ఇదే విధంగా ఆందోళన చెందింది. ఆ సమయంలో 20 మంది చైనా అధికారులను వారి పదవుల నుంచి తొలగించారు.

READ ALSO: T20 World Cup 2026: అయ్యో అయ్యయ్యో సంజు శాంసన్‌.. ఇక అంతే సంగతులు, ఇషాన్‌కు ప్లేస్ ఫిక్స్!

Exit mobile version