Site icon NTV Telugu

China Tomb Raiding Case: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. సమాధులను తవ్వి కటకటాల పాలయ్యాడు..

China Tomb Raiding Case

China Tomb Raiding Case

China Tomb Raiding Case: నిజంగా ఆ వ్యక్తి కథల నుంచి ప్రేరణ పొందాడు. కానీ ఆయన జీవితంలో కథ అడ్డం తిరిగింది. ఆయనకు పురాతన రహస్య సమాధులకు సంబంధించిన కథలు చదవడం అంటే విశేషమైన ఆసక్తి. అది ఎక్కడి వరకు వెళ్లిందంటే.. ఆ వ్యక్తి నిజ జీవితంలో అలాంటి పురాతన రహస్య సమాధులను కనుగొనే వరకు వెళ్లింది. ఎంతో కష్టపడి సమాధులను కనుక్కొని వాటిని తవ్వి, రహస్య నిధులను వెలికి తీశాడు. కానీ వాటిని అమ్మడానికి వెళ్లి పోలీసులకు దొరికిపోయాడు. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: PM Modi: ఈయూ నేతలతో చర్చించిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..

చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన యు అనే వ్యక్తి ప్రతిరోజూ సమాధి దోపిడీ నవలలు చదివేవాడు. ఇది తన డైలీ రొటిన్. మనోడు ఇక్కడితో ఆగిపోతే అస్సలు ఈ కథే ఉండేది కాదు. కానీ మనోడు ఆగిపోలే.. కథలు చదివి సంతృప్తి చెందకుండా, కథలలో పేర్కొన్న పాత సమాధులను పరిశోధించడం ప్రారంభించాడు. ఏదైనా అనుమానాస్పద లేదా అస్పష్టమైన కథనాలు కనిపించినప్పుడల్లా, అతను వాటిని స్థానిక కౌంటీ రికార్డులతో తరచుగా తనిఖీ చేసేవాడు. నవలలలో వివరించిన రహస్య సమాధులపై తనకు గొప్ప ఆకర్షణ ఉండేది. వాటిలో నిధి దాచినట్లు నవలలలో చెప్పారు కాబట్టి.. సమాధి దోపిడీ కల్పిత పద్ధతులను ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

తొలి అడుగు ఇక్కడే..
గువో కుటుంబ సమాధుల వద్ద పురావస్తు పరిశోధన గురించి అతని ఫోన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు తన నిజ జీవిత సమాధి – దోపిడీ ప్రయత్నం ప్రారంభమైందని ఆయన చెప్పాడు. ఈ ప్రాంతం హుబేలోని రక్షిత సాంస్కృతిక వారసత్వ ప్రదేశం. దీనిని 20 ఏళ్ల క్రితం ఒక రహదారి నిర్మాణ సమయంలో మొదటిసారిగా తవ్వారు. తన ఫోన్‌కు వచ్చిన పాత సమాధికి సంబంధించిన నోటిఫికేషన్లో
తవ్వకాల సమయంలో పెద్ద సంఖ్యలో కాంస్య కళాఖండాలు దొరికాయని చెప్పారు. ఇది యులో ఆసక్తిని రేకెత్తించింది. అతను మొదటిసారిగా అక్రమ తవ్వకాన్ని ప్రయత్నించాడు. యూ వెంటనే సహాయం కోసం తన బృందంలో చెన్ అనే వ్యక్తిని, ఇతర సహచరులను చేర్చుకున్నాడు. దొంగతనం చేయడానికి తాను మొదట చుట్టుపక్కల పర్వత శ్రేణిల లేఅవుట్‌ను అధ్యయనం చేశానని యు పోలీసుల విచారణలో అంగీకరించాడు. రెండు వారాల తర్వాత యు ఒక సమాధి ప్రవేశ ద్వారాన్ని గుర్తించాడు. తరువాత ఆయన జాగ్రత్తగా పారతో దానిని తవ్వి.. ఇద్దరు వ్యక్తులతో కలిసి 20 పురాతన కాంస్య విగ్రహాలను కనుగొన్నాడు. రెండు రోజులు కష్టపడి.. ఈ ముగ్గురు వ్యక్తులు 20 కాంస్య కళాఖండాలను వెలికి తీశారు.

వీళ్లు బయటికి తీసిన వాటిని అమ్మి త్వరగా కోటీశ్వరులు కావాలనే ఆలోచనలతో.. యు మధ్యవర్తి ద్వారా ధనవంతుడైన కొనుగోలుదారుని వెతకడంలో సహాయం కోసం లి అనే వ్యక్తిని సంప్రదించాడు.
నవంబర్ 2023లో ఓ పోలీసు బృందం కొనుగోలుదారుగా నటిస్తూ యు ను కలిసింది. ఆయన దగ్గర 20 పురాతన కళాఖండాలు ఉన్నట్లు వారు గుర్తించారు. వాటి విలువ నాలుగు మిలియన్ యువాన్లు లేదా రూ.5 కోట్లుగా అంచనా వేశారు. ఆ డబ్బులతో కోటీశ్వరులు కావాల్సిన వాళ్లు చివరికి అరెస్టు అయ్యారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 20 కళాఖండాలన్నీ 771 BC నాటివి. వీటిలో తొమ్మిది జాతీయ ఫస్ట్-క్లాస్ సాంస్కృతిక అవశేషాలుగా గుర్తించారు. కేసును విచారించిన తర్వాత యు, చెన్లకు ఒక్కొక్కరికి 10 ఏళ్ల మూడు నెలల జైలు శిక్ష, పురావస్తు రక్షణ ఖర్చులను భరించటానికి 70,000 యువాన్ల జరిమానా విధించారు. లీకి మూడేళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

READ ALSO: PM Modi: ట్యాక్స్‌లతో చిన్న పిల్లలను వదలని కాంగ్రెస్.. జీఎస్టీ సవరణలపై మోడీ

Exit mobile version