NTV Telugu Site icon

China: యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా.. సంచలన వ్యాఖ్యలు తెరమీదకు!

Nikki Haley

Nikki Haley

‘China an existential threat to US says Indian-American Nikki Haley: కరోనా (కోవిడ్ 19) అనే మహమ్మారిని ప్రపంచ దేశాలపైకి వదిలి.. అందరినీ గడగడలాడించిన చైనా.. ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికీ పెద్ద ముప్పుగా మారిందని, ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం న్యూహ్యాంప్ షైర్ లో ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఆమె ప్రపంచ దేశాలకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. అగ్రరాజ్యమైన తమ దేశానికి డ్రాగన్ కంట్రీ చైనాతో ప్రమాదం పొంచి ఉందని, తమపై యుద్ధానికి చైనా సిద్ధమవుతోందని నిక్కీ పేర్కొన్నారు. 50 ఏళ్లుగా చైనా తమపై యుద్ధం చేసి ఓడించేందుకు పన్నాగాలు పన్నుతోందని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే కొన్ని విషయాలలో చైనా సైన్యం అమెరికా సైన్యంతో సమానంగా ఉందన్నారు.

Riniki Bhuyan Sarma: ఎంపీపై సీఎం భార్య పరువు నష్టం దావా

దేశ మనుగడకోసం కమ్యూనిస్టు దేశమైన చైనాను ఎదుర్కొనేందుకు బలం, ఆత్మాభిమానం చాలా అవసరమని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైనా.. అమెరికా వాణిజ్య రహస్యాలను తెలుసుకుని, తమపై గెలవాలని ప్రణాళికలు వేస్తోందని, చైనాను ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని నిక్కీ హేలీ సూచించారు. ఆర్థిక ప్రణాళికలపై నిక్కీ హేలీ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అమెరికా ప్రజలంతా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని, తనను అధ్యక్షురాలిని చేస్తే.. ఆర్థిక వినియోగంపై అందరికీ పూర్తి స్వేచ్ఛను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఫెడరల్ గ్యాస్, డీజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తామన్నారు. తద్వారా అధిక గ్యాస్ ధరలతో విసిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలకు కాస్తంత ఊరట లభిస్తుందన్నారు. అలాగే శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్ను తగ్గించడంతో పాటు.. బైడెన్ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తానని నిక్కీ హేలీ హామీల వర్షం కురిపించారు.