NTV Telugu Site icon

CM Chandrababu: ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Chandrababu

Chandrababu

CM Chandrababu: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసి.. పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వాటికి చేయూతను ఇస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనేక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరతిగతిన పూర్తి చేసి.. వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం అన్నారు. భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్క్‌లు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో ఎలాగైతే రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ది చేకూర్చామో.. అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులోనూ అవలంభించాలన్నారు.

Read Also: Employees Transfers: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బదిలీల గడువు పొడిగించిన సర్కార్..

పుణె వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెప్పగా….అలాంటి విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థంలేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్థేశించిన సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ అధికారి అయినా, విభాగం అయినా అనుమతి ఇవ్వకపోతే.. ఆటోమేటిక్‌గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే.. చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు. డ్వాక్రా సంఘాల వంటి వాటిని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేయాలని.. వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పరిశ్రమల ఇన్సెంటివ్స్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉందని.. దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతికత ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా అధికారులు కార్యచరణ అమలు చేయాలన్నారు. ఆటోనగర్లను మోడ్రనైజేషన్ చేయాలని, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 క్లస్టర్లను పూర్తి చెయ్యాలన్నారు. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారెంటీకి రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. విశ్వకర్మవంటి కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ అందేలా చూడాలని అన్నారు.

ఆహార శుద్ది పరిశ్రమకు రాష్ట్రంలో అపార అవకాశాలు
రాష్ట్రంలో ఆహారశుద్ది రంగంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రాష్ట్రంలో అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ ఉత్తత్తులకు.. ఆహార శుద్ధి పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం అన్నారు. రైతులు తాము పండించే పంటలకు వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని.. వాటిని ప్రోత్సహించాలని సీఎం వ్యాఖ్యానించారు. ఆయా ప్రాంతాల్లో పండే టమాటా, మ్యాంగో, మిరప, పసుపు, ఆక్వా ఉత్పత్తులకు అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. పుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి గ్రామాల్లో ప్రోత్సాహం ఇచ్చే విధంగా విధానాలు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. సమీక్షలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.