Chicken Price Cross RS 320 Per Kg in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో ధరలు ఆకాశాన్ని తాకుతూ.. ‘కొండెక్కిన కోడి’లా మారాయి. సాధారణంగా డిమాండ్ తక్కువగా ఉండే అన్ సీజన్‌లోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటేసి.. కిలోకు రూ.320 వరకు అమ్ముడవుతున్నాయి. ధర రూ.300 దాటడంతో సామాన్యులకు చికెన్ కూర దూరమవుతోంది.
స్థానిక మార్కెట్లలో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో.. సామాన్య జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ ధర ఎంత అని అడిగి.. కొనకుండా వెళ్లిపోతున్నారని వ్యాపారాలు అంటున్నారు. ఇదే ధరకు హాఫ్ కేజీ మటన్ వస్తదని కదా అంటూ.. కొనకుండా కొనుగోలుదారులు వెళ్లిపోతున్నారట. ప్రస్తుతం షాప్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయి. గతంలో ఇదే సమయంలో చికెన్ ధరలు తక్కువగా ఉండేవి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా తగ్గిపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో మార్కెట్‌లో చికెన్‌కు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనే కిలో చికెన్ ధర రూ.380 వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత భారంగా మారే అవకాశముందని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
