Site icon NTV Telugu

Off The Record: రసవత్తరంగా మారుతున్న చేవెళ్ళ కాంగ్రెస్ రాజకీయం

Chevella

Chevella

Off The Record: చేవెళ్ల కోటలో చిచ్చు రేగిందా? స్నేహ గీతం వినిపించాల్సిన చోట…. సవాళ్ళ పర్వం నడుస్తోందా? మామూళ్ల మేటర్స్‌ అధికార పార్టీలోనే కల్లోలం రేపుతున్నాయా? పదేళ్ళపాటు ఎవరు ఎవరికి మామూళ్ళు సమర్పించుకున్నారు? ఇన్నేళ్ళలో లేనిది ఇప్పుడే ఆ వ్యవహారం ఎందుకు బయటికి వచ్చింది? చేవెళ్ల కాంగ్రెస్‌ కహానీ ఏంటి?

Read Also: Donald Trump: “గ్రీన్‌ల్యాండ్” అమెరికా భూభాగమే.. దావోస్‌లో ట్రంప్ ఫైరీ స్పీచ్..

చేవెళ్ళ కాంగ్రెస్‌లో కాక రేగుతోంది. అదీకూడా అలా ఇలా కాదు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు దగ్గరైన ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గ హస్తం ఇన్ఛార్జ్‌ భీం భరత్‌ మధ్య పేలుతున్న మాటల తూటాలతో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. అదీకూడా.. మామూళ్ళ ఆరోపణలు పీక్స్‌కు చేరడంతో రంబోలా అవుతోంది. ఎమ్మెల్యే యాదయ్య, పార్టీ ఇన్ఛార్జ్‌ భీం భరత్ మొన్నటిదాకా.. ఒకే వేదిక మీద కనిపించినా.. ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పదేళ్ళ మామూళ్ళ బాగోతంలో తేడా వచ్చి ఉండవచ్చన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఆ మామూళ్ళ ప్రస్తావన కూడా ఎమ్మెల్యే నోటి నుంచి రావడం ఇంకా ఉత్కంఠ రేపుతోంది.

Read Also: ACB Raids : ఏసీబీ వలలో మరో తిమింగలం.. 100 కోట్ల అక్రమాస్తులు..!

భీం భరత్‌కు మామూళ్లు ఇచ్చానంటూ.. మున్సిపల్‌ ఎన్నికల వేళ ఎమ్మెల్యే పేల్చిన బాంబు ప్రకంపనలు రేపుతోంది. అసలు ఆ మామూళ్లు ఎందుకు ఇచ్చారు? ఆ పదేళ్లలో ఏం జరిగింది? ఎమ్మెల్యేని తన సొంత ఊరిలోనే ఒంటరిని చేసే కుట్ర జరుగుతోందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో బిజీగా ఉన్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్‌లో ఉన్నట్టా? లేక కాంగ్రెస్‌లో చేరినట్టా? అన్న గందరగోళమే ఇన్నాళ్ళు చేవెళ్ళలో చర్చనీయాంశం కాగా.. ప్రస్తుతం ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు పొలిటికల్ పొగలు పుట్టిస్తున్నాయి. సొంత ఊరి వాళ్లతోనే నా మీద స్పీకర్‌కు ఫిర్యాదు చేయిస్తారా? నా పరపతిని దెబ్బతీస్తారా? అంటూ ఆవేదన, ఆవేశాన్ని కలగలిపి ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే. అదే సమయంలో అసలు దీని వెనకున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? భీం భరత్‌తో ఎమ్మెల్యేకి ఉన్న ఆ పదేళ్ల మామూళ్ల బంధం ఏంటన్న చర్చలు సైతం మొదలయ్యాయి. నిధుల కోసం తిరుగుతున్న ఎమ్మెల్యే యాదయ్యని నియోజకవర్గంలోనే అడుగు పెట్టకుండా చేయాలని చూస్తున్నారా? అన్నది కూడా కొందరి డౌట్‌ అట.

Read Also: రూ.9,699కే జియో ఎకోసిస్టమ్‌తో Blankput తొలి స్మార్ట్ టీవీ.. ధర, ఫీచర్లు ఇవే!

అటు భీం భరత్‌ కూడా తగ్గేదేలే అంటున్నారు. నాకు మామూళ్లు ఎక్కడ ఇచ్చావో.. ఎప్పుడు ఇచ్చావో నిరూపించు.. లేదంటే తలవంచు అంటూ డైరెక్ట్‌గా ఎమ్మెల్యేకే సవాల్‌ విసరడం కాక పుట్టిస్తోంది. పార్టీ మారారని బయట చెప్పుకుంటున్నా.. కాలె యాదయ్య మాత్రం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని క్లారిటీ ఇస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని, మంత్రులను కలిస్తే తప్పేంటన్నది ఆయన క్వశ్చన్‌. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో సరికొత్త డిస్కషన్‌ మొదలైంది. ఈ రాజకీయ చదరంగంలో చెక్ పడేది ఎవరికి? ఔట్‌ కాబోయే వికెట్ ఎవరిది? ఈ పంచాయితీ గాంధీ భవన్ మెట్లు ఎక్కుతుందా? అంతకు మించి సీఎం రేవంత్ దాకా వెళ్తుందా? అన్న రకరకాల ప్రశ్నలు మెదులుతున్నాయి పొలిటికల్ పండిట్స్‌ మెదళ్ళలో. చేవెళ్ళలో రగులుతున్న సెగలు చివరికి పొలిటికల్‌ గిమ్మిక్కుగా మారిపోతాయా? లేక కొత్త కొత్త మలుపులతో సరికొత్త రాజకీయానికి తెర తీస్తాయా అన్నది చూడాలి.

Exit mobile version