NTV Telugu Site icon

Cheteshwar Pujara: 100వ టెస్టు ముంగిట పుజారా.. చిరకాల కోరిక అదేనంట!

11

11

టీమిండియా టెస్టు స్పెషలిస్టుగా టీమిండియా తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు ఛతేశ్వర్ పుజారా. సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టుకు మరపురాని విజయాల్ని అందించాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి విజయానికి అడ్డుగోడగా నిలబడి ద్రవిడ్ తర్వాత నయా వాల్‌గా పేరుగాంచాడు. అటువంటి పుజారా.. కెరీర్‌లో కీలక మైలురాయి ముందున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తన వందో టెస్టు ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగబోయే రెండో టెస్టు ద్వారా పుజారా ఈ అరుదైన ఘనత సాధించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే విలేకరులతో ముచ్చటించిన అతడు తన మనసులోని మాటల్ని వెల్లడించాడు. 13 ఏళ్ల తన కెరీర్‌లో అనుభవాలను వివరిస్తూ వచ్చిన నయా వాల్‌.. తన అత్యుత్తమమైన ప్రదర్శనలు, ధీటైన ప్రత్యర్ధి, కఠినమైన బౌలర్‌, తన చిరకాల కోరిక.. ఇలా చాలా విషయాలను పంచుకున్నాడు.

Also Read: Prithvi Shaw : సెల్ఫీ కోసం గొడవ.. క్రికెటర్ పృథ్వీ షా కారుపై దాడి!

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడమే తన చిరకాల కోరిక అని మనసులో మాటను బయటపెట్టిన పుజారా.. ధీటైన ముగ్గురు ప్రత్యర్ధుల్లో మొదటిది ఆసీస్‌, రెండో జట్టు ఇంగ్లాండ్‌, మూడో టీమ్‌ న్యూజిలాండ్‌ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన బౌలర్లలో అండర్సన్‌ పేరును మొదట ప్రస్తావించిన పుజారా.. డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌, ప్యాట్ కమిన్స్‌ల పేర్లు చెప్పాడు. ఇక తన అత్యుత్తమ ప్రదర్శన గురించి పుజారా మాట్లాడుతూ.. అరంగేట్రంలో ఆసీస్‌పై చేసిన 72 పరుగులకు ఫస్ట్‌ ర్యాంక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత చెన్నైలో ఆసీస్‌పై చేసిన 92 పరుగులు, జొహన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాపై చేసిన 123 పరుగులు, అలాగే గత ఆసీస్‌ పర్యటనలో గబ్బా టెస్టులో ఆడిన ఇన్నింగ్స్‌లు అత్యుత్తమమైనవిగా చెప్పుకొచ్చాడు.

Also Read: Vivo Y100: కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌తో వివో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవే!

కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు పుజారా కెరీర్‌లో వందో టెస్టు కానున్న విషయం తెలిసిందే. భారత్‌ తరఫున ఇప్పటివరకు 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది. ఆసీస్‌తో రెండో టెస్టులో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్‌లో చేరే 13వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్‌ కోహ్లీ మాత్రమే 100 టెస్టుల మైలురాయిని అధిగమించాడు.

Also Read: Akshay Kumar: ఈ రీమేక్ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తావా ఖిలాడీ?