భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా తన ఆల్-టైమ్ టీమ్‌మేట్స్ ఎలెవన్‌ను ప్రకటించి ఆసక్తి రేకెత్తించారు. ఈ జట్టులో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, అజింక్య రహానే వంటి ప్రముఖ ఆటగాళ్లకు స్థానం దక్కకపోవడం గమనార్హం. 2010 నుంచి 2023 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో చురుగ్గా ఉన్న పుజారా, తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తనతో కలిసి ఆడిన సహచరులనే ఈ జట్టు కోసం ఎంపిక చేశారు. మొత్తం 103 టెస్టుల్లో 7,195 పరుగులు సాధించిన ఈ టెస్ట్ స్పెషలిస్ట్, తన టీమ్‌లో ఐదుగురు ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లను, ఆరుగురు రిటైర్డ్ ఆటగాళ్లను చేర్చారు.
ఈ జట్టు ఓపెనర్లుగా దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్‌లకు స్థానం కల్పించారు. ద్రవిడ్ , తన ఇష్టపడే స్థానమైన మూడో నంబర్ స్థానంలో పుజారా తనను తాను ఎంచుకోవడం విశేషం. ద్రవిడ్ తదనంతరం భారత టెస్టు జట్టులో ‘ది వాల్’గా పుజారా పేరొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను నాలుగో నంబర్‌లో, విరాట్ కోహ్లీని ఐదో నంబర్‌లో ఎంపిక చేశారు. రహానే స్థానంలో అనుభవజ్ఞుడైన వివిఎస్ లక్ష్మణ్‌కు ఆరో స్థానంలో అవకాశం ఇచ్చారు.
వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని కంటే ఆస్ట్రేలియా పర్యటనల్లో తనతో కలిసి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన రిషభ్ పంత్‌కే పుజారా మొగ్గు చూపారు. ఇక బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించారు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంచుకోగా, వేగవంతమైన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు స్థానం ఇచ్చారు. అదనంగా పిచ్ పరిస్థితులను బట్టి ఉపయోగించుకోవడానికి 12వ ఆటగాడిగా పేసర్ ఇషాంత్ శర్మను ఎంపిక చేశారు. ఒకవేళ పేస్ ఆల్‌రౌండర్ అవసరమైతే హార్దిక్ పాండ్యాను పరిశీలిస్తానని ఆయన పేర్కొన్నారు.
చేతేశ్వర్ పుజారా ఆల్-టైమ్ టీమ్‌మేట్స్ ఎలెవన్ ఇదే..
రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్, చేతేశ్వర్ పుజారా, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వివిఎస్ లక్ష్మణ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ (12వ ఆటగాడు: ఇషాంత్ శర్మ).

