NTV Telugu Site icon

Chandrayaan-3: చందమామపై దిగిన చంద్రయాన్-3.. ఇస్రోకు పంపిన తొలి మెసేజ్‌ ఇదే..

Isro

Isro

Chandrayaan-3: ఇస్రో చరిత్ర సృష్టించింది… జాబిలమ్మపై అడుగుపెట్టి సత్తా చాటింది.. భారత్‌ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తోంది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది చంద్రయాన్‌-3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది.. ఇక, చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది.. దీంతో.. ఇస్రోతో పాటు భారత్‌ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దృక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఆ తర్వాత ఇస్రోకు తొలి మెసేజ్‌ను పంపింది.

జాబిలమ్మపై అడుగుపెట్టిన తర్వాత చంద్రయాన్‌-3 నుంచి ఇస్రోకు చేరిన తొలి మెసేజ్‌ ఏంటి అంటే.. ”నేను నా గమ్యాన్ని చేరుకున్నా.. మీరు (భారత్‌, ఇస్రో) కూడా”.. అంటూ మెసేజ్‌ను పంపింది. ఇక, దీనిని ఇస్రో ధృవీకరించింది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని ప్రకటించింది.. భారతదేశానికి అభినందనలు అంటూ ట్వీట్‌ చేసింది.. మరోవైపు.. చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్రమోడీ.. ఈ విజయంతో నా జీవితం ధన్యమైంది అన్నారు. భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు.. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు.. చంద్రయాన్‌-3 విజయం నవభారత జయధ్వానం.. బ్రిక్స్‌ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్‌-3 పైనే ఉందన్నారు.. చంద్రయాన్‌-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఆయన.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారని పేర్కొన్నారు. కాగా, చందమామ దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింగా.. ఇప్పటి వరకు చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికా, రష్యా, చైనా సరసన ఇప్పుడు భారత్‌ చేరింది.

ప్రగ్యాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ నుండి కొద్దిగంటలలో బయటకు రావచ్చు.. లేదా ఒకరోజు పట్టవచ్చు.. అక్కడి పరిస్థితులను బట్టి ప్రగ్యాన్ బయటకు వస్తుందని తెలిపారు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌.. చంద్రయాన్‌ 3 విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది.. ఇది సులువైన పని కాదు… దీని వెనుక ఎంతో కష్టపడ్డాం.. ల్యాండర్ స్థితిగతులు పరిశీలించాక రోవర్ ను బయటకు తెస్తాము. దీనికి కొన్ని గంటలు లేదా ఒక రోజు సమయం పట్టవచ్చు అన్నారు. 14 రోజులు చంద్రుడిపై రోవర్ పరిశోధన కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్నారు.. ఆదిత్య ఎల్ 1 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగం ఉంటుందని.. దీనితో సూర్యుడి గురించి శోధనలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.. గగన్ యాన్ ప్రయోగం చేపట్టనున్నట్టు ప్రకటించారు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌.