NTV Telugu Site icon

Chandrababu: యువకులను కాపాడండి.. సీఎస్ కు చంద్రబాబు లేఖ

Chandrababu

Chandrababu

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజన్సీలు యువతను మోసం చేశాయని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం ఎన్ఐఏ విచాణలో బయటపడిందని..బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని రాసుకొచ్చారు. కాంబోడియా, లావోస్, ఇతర ప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధిత యువత గమ్యస్థానాలకు చేరుకుంటోందని.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

READ MORE: How to avoid stress: ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఈ సూత్రాలు పాటించండి

కాగా.. కంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులకు విముక్తి కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా కొనసాగుతోంది. మొదటి రోజు 25 మందికి విశాఖ పోలీసులు విముక్తి కలిగించారు. కంబోడియాలో విశాఖకు చెందిన మొత్తం 58 మంది యువకులు చిక్కుకున్నారు. దశలవారీగా మిగతా వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ వెల్లడించారు. ఏడాదిలో ఒక్క విశాఖపట్నం నుంచే సుమారు రూ.120 కోట్ల దోపిడి జరిగింది.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 మంది వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ కంబోడియా కోసం 20 మంది పోలీసులతో సిట్ ఏర్పాటు చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మూలాలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బృందాలు వెలికి తీస్తున్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు జాయింట్ సీపీ ఫకిరప్ప నాయకత్వం వహిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు పంపించే 70 ఏజెన్సీలపై విశాఖ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.