NTV Telugu Site icon

AP Pensions: పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.. సీఎస్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu

Chandrababu

AP Pensions: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా రేపు పెన్షన్లు అందేలా చూడాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత లేఖ రాశారు. సీఎస్‌తో పాటు ఏపీ సీఈఓకూ చంద్రబాబు లేఖ రాశారు. పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సీఈవోను చంద్రబాబు కోరారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబుకు కక్ష.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని లేఖలో చంద్రబాబు కోరారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.వృద్ధులు, వింతంతువులు, ఇతర లబ్దిదారులకు నగదు రూపంలో పెన్షన్ మొత్తం చెల్లించాలని కోరారు. గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలన్నారు.

దీని కోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లాడానికి అనుమతించాలన్నారు. దీనికి అవసరం అయిన అనుమతులు ఇవ్వాలని ఏపీ సీఎస్‌తో పాటు సీఈవోను కోరారు. పెన్షన్ల పంపిణీకి అవసరం అయిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదనే వార్తలు వస్తున్నాయన్నారు. పెన్షన్ల పంపిణీకి అవసరం అయిన నిధులు వెంటనే అందుబాటులో ఉంచాలన్నారు. గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5 తేదీ మధ్య పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేసేలా అవరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని చంద్రబాబు కోరారు.