Site icon NTV Telugu

Chandrababu: వింజమూరు ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu At Udayagiri

Chandrababu At Udayagiri

Chandrababu: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో టీడీపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు అభివృద్ధి చేయడం చేతకాదని.. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీల పెంచనని చెప్పి ప్రజలపై భారం వేశారని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయన్నారు. మద్యం ధరలు పెంచి నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Read Also: CM YS Jagan: ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

జగన్ చెప్పే మద్యపాన నిషేధాన్ని మీరు నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పారని.. ఇప్పుడు చేశారా.. మీరే ఆలోచించాలన్నారు. మద్యంపై వచ్చే ఆదాయంతో రూ.16 వేల కోట్ల మీద అప్పులను తీసుకువచ్చారని ఆరోపణలు చేశారు. వింజమూరులో కూడా గంజాయి దొరుకుతోందన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ గంజాయిని మాత్రం సరఫరా చేస్తారని విమర్శించారు. విశాఖపట్నం పోర్టు ద్వారా 25 వేల కిలోల డ్రగ్స్ దిగుమతి అయ్యాయని.. డబ్బుల కోసం గంజాయి.. డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారని ఆరోపించారు. జగన్ వల్ల యువత భవితవ్యం నిర్వీర్యమవుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు రావడం లేదన్నారు.

జగన్ హయాంలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందన్న చంద్రబాబు.. అన్ని వర్గాల ప్రజలూ దెబ్బ తిన్నారన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల మేర అప్పులు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవాళ్లంతా ప్రస్తుతం బాధపడుతున్నారని.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందు కోసమే బీజేపీ, జనసేనతో జతకట్టామన్నారు. కేంద్రం నుంచి నిధులు మనకు చాలా అవసరమని.. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. దీనిని ప్రజలంతా కూడా ఆమోదించాలన్నారు. మూడు రాజధానులని చెప్పి మూడుముక్కలాట ఆడారని.. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. తిరుమలలో నాణ్యమైన భోజనాన్ని కూడా భక్తులకు పెట్టలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల నీటి సమస్య ఏర్పడిందన్నారు.

కాకర్ల సురేష్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారిని ఆశీర్వదించాలని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఉదయగిరిలో ఫ్లోరైడ్ సమస్యను తీరుస్తామన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి తానే ఆధ్యుడిని అని చంద్రబాబు తెలిపారు. జగన్ ఐదేళ్లు పాలించి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు.

 

Exit mobile version