NTV Telugu Site icon

Chandrababu: సీఎం గ్రాఫ్ పడిపోయింది.. పులివెందులలో జగన్‌కు ఓటమి ఖాయం..!

Chandrababu

Chandrababu

Chandrababu: సీఎం వైఎస్‌ జగన్‌కు పులివెందులలో ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ముస్లిం, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతలు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు.. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్‌కు ఎవరూ ఓటు వేయరన్నారు.. జగన్‌కు పులివెందులలో ఓటమి ఖాయమన్న ఆయన.. నాలుగేళ్ల నరకాన్ని అనుభవిస్తున్నాం.. రాచమల్లు ప్రొద్దుటూరు బకాసురుడు అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే చేసిన తప్పులను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను చంపేశాడు. మట్కా నిర్వహణ.. గుట్కాల అమ్మకం.. తోపుడు బళ్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేయడం ఎమ్మెల్యే రాచమల్లుకు అలవాటు.. ఒకప్పుడు మామూలు కౌన్సిలర్‌గా కూడా గెలవలేని వ్యక్తి.. ఇప్పుడు ప్రొద్దుటూరును మింగేసే స్థాయిలో బలిసిపోయాడంటూ ఫైర్‌ అయ్యారు.

పేదలపై రూ. 51 వేల కోట్ల మేర విద్యుత్ భారం వేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.. టమాట రూ. 200కు చేరింది. నిత్యావసర ధరలు పెరిగాయి. టీడీపీ హయాంలో ధరలు పెరిగితే నియంత్రించాం అన్నారు. ఉల్లిపాయ ధరలు పెరిగితే నాసిక్ నుంచి ఉల్లిపాయలు తెప్పించి ధరలను కంట్రోల్ చేశాను. చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగనే అంటూ మండిపడ్డారు. ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు ఇస్తామన్న ఆయన.. తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. ముగ్గురు పిల్లలుంటే రూ. 45 వేలు.. నలుగురు పిల్లలుంటే రూ. 60 వేలు ఇస్తామని పేర్కొన్నారు చంద్రబాబు.

ఈ ప్రభుత్వంలో జాబ్ గ్యారెంటీ లేదు.. ఫిష్ మార్కెట్ పెట్టి ఉద్యోగాలు తెచ్చాననే సీఎం జగనే అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు.. మేం 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ఆయన.. పరిశ్రమలు.. పెట్టుబడులు తెస్తాం. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం.. మంచినీటి సౌకర్యం కల్పిస్తాం. బీసీల కోసం రక్షణ చట్టం తెస్తాం. పేదలను ధనికులను చేసేలా పూర్ టు రిచ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామంటూ హామీల వర్షం కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ గ్రాఫ్ పడిపోయింది.. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఇంటికి పోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు.. ఈ ప్రభుత్వం దొంగలకు అండగా ఉంటోంది. నిన్నా మొన్నా ఢిల్లీకి వెళ్లాడు.. ఏ సాధించాడు..? అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలంటే వాళ్లే లీకులిస్తారు.. వాళ్లే ఖండిస్తారు.. కానీ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధమని ప్రకటించారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే.. జగన్ అంత త్వరగా ఇంటికి పోతాడన్న ఆయన.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల అధికారులు.. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితికి వచ్చారన్నారు.. మరోవైపు.. ఎన్టీఆర్ జన్మదినం రోజు టీడీపీ మహానాడు పెట్టాం.. రేపు వైసీపీ ఆవిర్భావ దినం.. కానీ, ఆవిర్భావ సభలు కేవలం రెండే సార్లు పెట్టారని విమర్శించారు. ఓసారి తల్లిని తప్పించడానికి ఆవిర్భావ సభ పెట్టారు.. మరోసారి శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకోవాలని పెట్టారని దుయ్యబట్టారు చంద్రబాబు.