AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు

Cm Chandrababu

Cm Chandrababu

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇప్పటికే మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయి.. ఇక, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు అయ్యాయి.. అయితే, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రాబోయే పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాల అంశాలపై ఆయన చర్చించారు. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరిగేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం రెండున్నరేళ్ల పాలనకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం ఉందని, పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు కూటమి పాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదమని అన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ఏకపక్షంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి కనిపించాలని, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలని మంత్రులకు సూచించారు.

ఏకగ్రీవ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు
పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు వేరని, పార్టీ గుర్తులు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలు వేరని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ పోరాటం ముగిసిన నేపథ్యంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలోని ప్రజలందరి ఆమోదంతో ఏకగ్రీవాలు జరిగితే ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధులతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని వివరించారు. ఇక, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాల గురించి ప్రజలకు విస్తృతంగా వివరించాలని ఆదేశించారు. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీ ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీకి రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీకి రూ.50 లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రజలకు తెలియజేయాలన్నారు. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు కనిష్టంగా రూ.5 లక్షలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం దానిని రూ.15 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అలాగే గరిష్టంగా ఉన్న రూ.20 లక్షల ప్రోత్సాహకాన్ని రూ.50 లక్షలకు పెంచిన విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు.

నేతల మధ్య విభేదాలు వద్దు.. ఐక్యతతో ముందుకు సాగాలి
మరోవైపు.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గ్రామస్థాయి నాయకులు పట్టుదలతో ఉంటారని, కొన్నిసార్లు ఒకే పార్టీలోని నాయకులు కూడా పోటీ పడే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి నాయకులతో ఎమ్మెల్యేలు మాట్లాడి ఏకాభిప్రాయానికి తీసుకురావాలని సూచించారు. పార్టీలో నేతల మధ్య పంతాలు, ఈగోలు కాకుండా ఐక్యత కనిపించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని గ్రామాలకు వెళ్లి స్థానిక నాయకులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఒకే పార్టీలో ఉన్న నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేసే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. జడ్పీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ ఇప్పటికే పోటీకి అంతగా ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికలను గ్రామాల అభివృద్ధికి వేదికగా మార్చుకోవాలని, ఏకగ్రీవాల ద్వారా వచ్చే నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..