NTV Telugu Site icon

Chandrababu Letter: సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత బహిరంగ లేఖ

Chandrababu

Chandrababu

Chandrababu Open Letter to AP CS Jawahar Reddy: సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులపై లేఖలో ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్దిదారుల్ని వేధిస్తున్నారని.. అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమని లేఖలో చంద్రబాబు తెలిపారు. ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజలకు మేలు చేసే అవకాశాలను కనీసం ఆలోచించడం లేదన్నారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరం, అత్యంత దుర్మార్గమన్నారు. వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర పెన్షన్‌ దారులు ఇబ్బందులు పడుతున్నారని.. పెన్షన్‌ పంపిణీ సకాలంలో జరగాలని ఎన్నికల కమిషన్‌ 02.04.2024న ఇచ్చిన మెమోలో పేర్కొన్నదన్నారు.

Read Also: Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్.. వెంట సోనియా, ప్రియాంక

అయినా ఆ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కుతూ, గత నెలలో సచివాలయాల వద్ద బారులు తీరేలా చేసి 33 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారన్నారు. లక్షలాది మందిని వేధించారని.. ఈ నెల కూడా అదే విధంగా పెన్షన్‌ దారులను రోడ్లపై మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి, నరకయాతనకు గురి చేస్తున్నారన్నారు. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేంత వ్యవస్థ గ్రామస్థాయిలో ఉన్నా.. ఇళ్ల వద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని ఆరోపించారు. పైగా, బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.. వెళ్లి తీసుకోండి అంటూ సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపించి చెప్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అలా చెప్పే సమయంలో పెన్షన్‌ పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా రాజకీయ కుట్రలకు ప్రాధాన్యమివ్వడం దుర్మార్గమన్నారు. రాజకీయంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలో అధికారులు భాగమవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

పెన్షన్‌ నగదును బ్యాంకుల్లో జమ చేయడం వల్ల పెన్షన్‌ సొమ్ము తీసుకోవడానికి వృద్ధులు ముప్పతిప్పలు పడుతున్నారన్నారు. చాలా కాలంగా బ్యాంకు ఖాతాల నిర్వహణ లేకపోవడంతో లక్షలాది ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయన్నారు. మరోవైపు బ్యాంకులకు వెళ్లిన వారికి కేవైసీ పేరుతో బ్యాంకు సిబ్బంది ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు తీసుకురమ్మని చెబుతున్నారన్నారు. వాటి కోసం మండుటెండలో లబ్దిదారులు రోడ్లపై తిరగాల్సి వస్తోందని చంద్రబాబు లేఖలో చెప్పుకొచ్చారు. మరోవైపు జాయింట్‌ ఖాతాలు, వ్యక్తిగత ఖాతాలు రెండూ ఉన్నవారికి ఏ ఖాతాలో నగదు జమయ్యిందో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. గత నెల మండుటెండలో సచివాలయాల చుట్టూ తిప్పారని.. ఇప్పుడు భారీగా మండిపోతున్న ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాశారు.