Chandrababu Naidu Arrest Live Updates : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు తరలించడంపై రాష్ట్రంలో టీడీపీ భగ్గమంటోంది. చంద్రబాబు అరెస్ట్‌నకు నిరసన టీడీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారు జాము నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారుయ. టీడీపీ కీలక నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ బంద్ పిలుపుకు జనసేన, సీపీఐ, లోక్‌సత్తా సహా వివిధ వర్గాలు మద్దతు తెలిపాయి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ చేయనున్నట్లు తెలిపింది.
-
చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం కుట్ర..
చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వ కుట్ర ఉందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైన చంద్రబాబు కళ్లు తెరుచుకోవాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు హర్షకుమార్.. ఇప్పటికైనా టీడీపీ, జనసేన పార్టీలు.. ఎన్నికల్లో ఎన్డీఏను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన పిలుపు మేరకు చేపట్టిన బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.
-
సెంట్రల్ జైలే చంద్రబాబుకు సేఫ్..
చంద్రబాబును హౌస్ కస్టడీ ఇవ్వాలన్న పిటిషన్లపై లోధ్రా.. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా.. పూర్తి భద్రత నడుమన ఉన్నారని కోర్టుకు తెలిపారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఇంట్లో ఉండటం కంటే సెంట్రల్ జైలులో ఉండటం చంద్రబాబుకు సేఫ్ అన్న ఆయన.. సుప్రీం కోర్టు ఇచ్చిన కేసు తీర్పును చంద్రబాబు కేసుకు ముడి పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. వీఐపీ ముద్దాయికి కల్పించే అన్ని వసతులు జైల్లో కల్పించాం. చంద్రబాబుకు జైల్లో పూర్తిగా సెక్యూరిటీ కల్పించాం.. జైలులో మాత్రమే కాదు.. జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్యూరిటీ ఉంది.. 24 గంటలు పోలీసులు డ్యూటీలో ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం అయుతే వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకే చంద్రబాబుకు హౌస్ అరెస్ట్‌కు అనుమతించవద్దని వాదనలు వినిపించారు..
-
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ వాయిదా
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు కలుస్తారని ముందుగా వార్తలు వచ్చాయి.. చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్ అవుతారని.. నారా భువనేశ్వరితో పాటు లోకేష్, బ్రాహ్మణిల ములాఖత్‌లో చంద్రబాబును కలుస్తారని ముందుగా చెప్పారు.. అయితే, తాజా సమాచారం ప్రకారం.. చంద్రబాబుతో ఈ రోజు కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయ్యింది.. రేపు అనగా మంగళవారం రోజు చంద్రబాబుని ఆయన కుటుంబ సభ్యులు కలుస్తారని తెలుస్తోంది..
-
చంద్రబాబు బెయిల్ పిటిషన్ రెడీ
బెయిల్ పిటిషన్ సిద్ధం చేశారు చంద్రబాబు న్యాయవాదులు.. ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయనున్నారు గింజు పల్లి సుబ్బారావు.. హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ వేయనున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు
-
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌లో అంశాలు ఇవే..
హౌస్ అరెస్ట్ కోరుతూ చంద్రబాబు తరపు దాఖలైన పిటిషన్ లో అంశాలు:-
*ఎన్‌ఎస్‌జీ రక్షణ కలిగిన వ్యక్తిని జైలులో ఉంచటం వల్ల ప్రాణహాని ఉంటుంది.
*2002లో హత్యాయత్నం తర్వాత కేంద్రం కంటిన్యూ చేసిన అధిక భద్రత విషయాన్ని హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణ సమయంలో పరిశీలన చేయాలి.
*సాక్షులను ప్రభావితం చేస్తారని రిమాండ్‌కి తరలిస్తారు కాబట్టి హౌస్ అరెస్ట్ చేయటం ద్వారా భద్రత, సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది.
-
సీఆర్‌పీసీలో హౌజ్ రిమాండ్ అనేదే లేదు: ఏపీ సీఐడీ
టీడీపీ అధినేత చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై ఏపీ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. సీఆర్‌పీసీలో హౌజ్ రిమాండ్ అనేదే లేదని కోర్టుకు తెలిపింది. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారని న్యాయస్థానానికి తెలిపింది. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్ కాపీలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో అరెస్ట్ కోరుతూ ఏసీబీ కోర్టులో సిట్ తరఫు న్యాయవాదులు పీటీ వారెంట్ వేశారు సిట్ తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో కోర్టుకి 6 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై చంద్రబాబును విచారించేందుకు సీఐడీ కోర్టును అనుమతి కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది.
చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30కి వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్‌ను.. హౌజ్ అరెస్ట్‌గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది.
-
చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై వాదనలు
విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. హౌస్ అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని వినతి చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోరారు. హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఏఏజీ అందుబాటులో లేరని, సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని సిట్ స్పెషల్ జీపీ కోరారు.దీంతో.. హౌజ్ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరమే ఆదేశాలేవైనా ఇస్తామని న్యాయమూర్తి చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేశారు. చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత విచారణ జరగనుంది.
-
ఫోన్‌లో లోకేష్‌ను పరామర్శించిన సీపీఐ నారాయణ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫోన్ చేసి పరామర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపామని లోకేష్‌తో నారాయణ అన్నారు. బంద్‌కు మద్దతు ఇచ్చినందుకు నారాయణకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
-
టీడీపీ కార్యాలయంలో సమావేశంమైన సీనియర్ నేతలు.
అమరావతి: టీడీపీ కార్యాలయంలో సమావేశంమైన సీనియర్ నేతలు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్న నేతలు.
సమావేశంలో యనమల, షరీఫ్, కళా వెంకట్రావు, ధూళిపాళ్ల.
సమావేశంలో ప్రతిభాభారతి, కంభంపాటి రామ్మోహన్.
-
చంద్రబాబు తరపున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు: అడిషనల్ అడ్వకేట్ జనరల్
చంద్రబాబు తరపున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. అందుకే చంద్రబాబునీ 5 రోజులు కస్టడీ కి ఇవ్వాలని పిటిషన్ వేశామన్నారు. అరెస్ట్ చేసిన 24 గంటల లోపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి కాబట్టి నిన్న చంద్రబాబు నీ కోర్టులో హాజరుపరిచామన్నారు.
రిమాండ్‌కు అనుమతి ఇస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు కాపీ ఇవాళ అందుతుందన్నారు. చంద్రబాబు తరపున హౌస్ అరెస్ట్ పిటిషన్, మందులు, ఆహారం ఇవ్వటానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారని ఆయన వెల్లడించారు. భద్రత రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే వేరే చోటు ఉండదన్నారు. నేడు చంద్రబాబు కస్టడీ కోసం తమ వాదనలు కోర్టుకు తెలియజేస్తామన్నారు.
-
సీసీ కెమెరాల నిఘాలో సెంట్రల్ జైలు
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న నేపధ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు బయట సెక్యూరిటీని పెంచారు. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జైలు ముఖ ద్వారం వద్ద 4 సీసీ కెమెరాలు ఏర్పాటు ఏశారు. ప్రస్తుతం సెంట్రల్ జైలు సీసీ కెమెరాల నిఘాలో ఉంది.
-
ఆందోళన చేపట్టిన టీడీపీ, జనసేన శ్రేణులు
నెల్లూరు జిల్లా వింజమూరులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బైకు ర్యాలీ చేపట్టి, ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను నాయకులు బయటకు పంపించారు. ఈ నేపథ్యంలో నేతలను పోలీసులు పీఎస్‌కు తరలించారు.
-
గవర్నర్ వద్దకు టీడీపీ, జనసేన ప్రతినిధులు
గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ, జనసేన ప్రతినిధుల బృందం కలిసింది. హార్బర్ పార్క్ గెస్ట్ హౌస్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు., మాజీమంత్రి గంటా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు గవర్నర్‌ను కలిశారు. చంద్రబాబు అరెస్ట్, జైలుకు తరలింపు రాజకీయ కక్షలో భాగంగా జరిగాయని గవర్నర్‌కు టీడీపీ నివేదించింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల గవర్నర్ ఆశ్వర్యం వ్యక్తం చేశారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అన్ని పరిణామాలను చూస్తున్నానని గవర్నర్ తమతో చెప్పారన్నారు. చంద్రబాబును ఒక్క రోజైన జైల్లో పెట్టాలనే కక్షతోనే అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
-
బెయిల్ పిటిషన్ వేసేందుకు న్యాయవాదుల సమాలోచనలు
చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేయటానికి ఉన్న అన్ని ఆప్షన్స్‌పై న్యాయవాదుల సమాలోచనలు చేస్తున్నారు. లంచ్ మోషన్ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. లంచ్ మోషన్‌కు న్యాయస్థానం అనుమతి ఇస్తే మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూద్రా ఇంకా బెజవాడలో ఉండటంతో ఆయన అధ్వర్యంలో న్యాయవాదులు పిటిషన్ వేయనున్నారు. ఇపుడు బెయిల్ పిటిషన్ వేసిన దాని వల్ల ఎంత వరకు బెయిల్ వస్తుంది అనే విషయంలో న్యాయవాదులు చర్చలు జరుపుతున్నారు. పిటిషన్ వేస్తే డిస్మిస్ అయ్యే అవకాశాలు ఎంత, బెయిల్ వచ్చే అవకాశాలు ఎంత అనే విషయాలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
-
కాసేపట్లో గవర్నర్ వద్దకు టీడీపీ, జనసేన ప్రతినిధులు
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కొద్దిసేపట్లో టీడీపీ, జనసేన ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. హార్బర్ పార్క్ గెస్ట్ హౌస్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు., మాజీమంత్రి గంటా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు చేరుకున్నారు. జనసేన తరపున గవర్నర్ దగ్గరకు నియోజకవర్గ ఇంఛార్జ్‌లు వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, జైలుకు తరలింపు రాజకీయ కక్షలో భాగంగా జరిగాయని గవర్నర్‌కు టీడీపీ నివేదించనుంది. రెండు రోజులుగా గవర్నర్‌ను కలిసేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది.
-
రాజమండ్రిలో బంద్ పాక్షికం
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో బంద్ పాక్షికంగా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ , జనసేన బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌కు మద్దతుగా రాజమండ్రిలో వ్యాపార సంస్థలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెలవు ప్రకటించింది. కూరగాయలు, మెడికల్, హోటల్స్ కు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చింది. బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దుకాణాలు తెరచుకున్నాయి.
-
దోర్నాల రహదారిపై టీడీపీ శ్రేణుల ధర్నా
ప్రకాశం జిల్లా పెద్దారవీడులో మార్కాపురం-దోర్నాల రహదారిపై టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సును వారు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని దేవరాజుగట్టు పీఎస్‌కు తరలించారు.
-
మాజీమంత్రి నారాయణ హౌస్ అరెస్ట్
నెల్లూరు జిల్లాలో మాజీమంత్రి నారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిషేధ ఆజ్ఞలు ఉండడంతో అనుమతి లేకుండా బయటకు వెళ్లవద్దని నోటీసు జారీ చేశారు.
-
మాజీ మంత్రి పరిటాల సునీత అరెస్ట్
శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను రామగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
-
ఎక్కడా కానరాని బంద్ ప్రభావం
టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. టీడీపీ నాయకులను బయటకు రానివ్వకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జిలు, ముఖ్య నేతలను ఇళ్ల వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయనగరం ఆర్టీసీ బస్ స్టేషను వద్ద టీడీపీ, జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. బస్సులను బయటకు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకోగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యథావిథిగా బస్సులు తిరుగుతుండగా.. దుకాణాలు తెరుచుకున్నాయి. బంద్ ప్రభావం ఎక్కడా కానరావడం లేదు.