Chandrababu: రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. సీఎం వైఎస్ జగన్‌కు ఓటు అడిగే హక్కే లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు.. సంక్రాంతి పండగను కూడ ప్రజలు సరిగా చేసుకోలేకపోయారు అన్నారు. టీడీపీ హయాంలో సంక్రాంతి కానుక ఇచ్చాం.. ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారులు.. చేనేత కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. టీడీపీలో 50 సంవత్సరాల వయసులోనే పింఛన్లు ఇచ్చాం.. చేనేత కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చే దానికంటే ఎక్కువగా ఇస్తాం అన్నారు. ఈ ప్రభుత్వంలో రెడ్లతోసహా అన్ని కులాల వారూ మునిగిపోయారు.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. తాను యువత కోసం ఎంతో తపన పడ్డాను.. వారికి ఐ.టి అనే ఆయుధాన్ని ఇచ్చాను. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు ఈ రంగంలో రాణిస్తున్నారని తెలిపారు.
తిరుపతి.. నెల్లూరు.. చెన్నైని ఒక హబ్ గా మార్చాలని ప్రయత్నం చేశాం.. వీటిని కనెక్ట్ చేస్తూ రహదారులు వేశాం.. తిరుపతిలో ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీలు వచ్చాయి.. టీడీపీ హయాంలో శ్రీ సిటీలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి.. జగన్ వచ్చిన తర్వాత అంతా తిరోగమనమే అని మండిపడ్డారు చంద్రబాబు.. రూ.630 ఓట్లతో తిరుపతిలో గరుడవారధిని తెస్తే.. జగన్ గంజాయి తెచ్చాడు అని ఎద్దేవా చేశారు. ఉక్కు పాదంతో ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టాం.. ఎర్రచందనం స్మగ్లర్ కు చిత్తూరు వైసీపీ సీట్ ఇచ్చారని విమర్శించారు. దక్షిణ కొరియాతో చర్చించి కియా కార్ల సంస్థ ను తీసుకువస్తే .. అమర రాజా ఫ్యాక్టరీని జగన్ తరిమేశారు.. మద్యానికి సంబంధించి అంతర్జాతీయ బ్రాండ్ లను తీసుకు వస్తే.. బూమ్ బూమ్ బ్రాండ్ ను జగన్ తెచ్చారు అని సెద్దేవా చేశారు.
రాజకీయాన్ని దోపిడీకి జగన్ వాడుకున్నాడు.. రాష్ట్రంలో అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది.. టి.డి.ఆర్. బాండ్లలో ఎన్నో అవకతవకలు జరిగాయి అని ఆరోపించారు చంద్రబాబు. తిరుపతి, విజయవాడ, గుంటూరు నగరాల్లో టి.డి.ఆర్. బాండ్ల పేరుతో వేలాది కోట్లు దోపిడీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారంలోకి వస్తేనే దర్యాప్తు చేయిస్తా అని ప్రకటించారు. ఎర్రచందనం స్మగ్లర్లను ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది.. ఐదేళ్లలో ఎక్కడైనా పట్టుకున్నారా? పోలీస్ సహకారంతో స్మగ్లింగ్ చేస్తున్నారు.. వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయాలను అపవిత్రం చేస్తున్నారు.. అయోధ్యలో రామాలయం కడుతున్నారని దేశమంతా ఎంతో ఉత్సాహంగా చూస్తోంది.. మన రాష్ట్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు.. వెంకటేశ్వర స్వామి వారిని వదిలిపెట్టరు..తిరుమల కొండపై అన్నదానంలో నాణ్యత లేదు అని విమర్శలు గుప్పించారు.
జగనన్న హౌసింగ్ కాలనీలలో భూ స్కామ్ జరిగింది.. 15 లక్షల రూపాయల మేర ఎకరాను కొని ప్రభుత్వానికి 50 లక్షలకు అమ్మేశారు అని కామెంట్ చేశారు చంద్రబాబు. మైనింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మాఫియాగా తయారయ్యారు.. కొండలూ.. గుట్టలు అన్నీ కనుమరుగవుతున్నాయి.. 4 వేల 500 కోట్ల విలువైన సిలికాను దోచేశారు.. గూడూరు ప్రాంతంలో తెల్లరాయిని దోచుకుంటున్నారు. కేజీఎఫ్ 3 గా మార్చారని మా నేత సోమిరెడ్డి దీక్ష కూడా చేశారు.. ఈ వ్యవహారాన్ని మేం తేలుస్తాం అన్నారు. ఇసుకలో కూడా దోపిడీ జరుగుతోంది.. ఇన్ని అరాచకాలు చేసిన వైఎస్ జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలలో దొంగ ఓట్లు చేర్చారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటాడు.. 98 శాతం హామీలు నెరవేర్చామంటున్నారు.. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుచుతామని చెప్పాడు.. ఇప్పుడు వాళ్ల ముందు మెడలు దించుతున్నారు అని ఫైర్ అయ్యారు.
సంపూర్ణ మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పాడు.. ఇప్పుడు మద్యంపై అప్పులు తీసుకువస్తున్నాడు అని ఎద్దేవా చేశారు చంద్రబాబు.. సీపీఎస్ వారంలో రద్దు చేస్తానని చెప్పారు.. ఇప్పటికి ఎన్ని వారాలు అయ్యాయి? ఏమి చేశారు? అని నిలదీశారు. వివేకానంద రెడ్డి కూతురు పైనే కేసులు పెడుతున్నారు.. జగనన్న బాణం ఏమైంది.. రివర్స్ గా వచ్చింది అన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమి కావాలి.. ఇదేనా విశ్వసనీయత అంటే.. ఎస్సీ ఎమ్మెల్యే లను జగన్ మారుస్తున్నారు.. ఈ ఊరి చెత్తను ఆ ఊరిలో వేస్తున్నారు.. ఒక్క ఛాన్స్ అనడంతో ప్రజలు ముచ్చటపడి జగన్ అధికారం ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ ఇన్చార్జి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తో పాటూ వాళ్ల అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారు.. ఇప్పుడు ఆయనకు టికెట్ లేదు.. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తన కుమారుడిని పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు.. మంత్రి కాకాని కోర్టులో ఫైళ్లనే చోరీ చేసిన దొంగ.. సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారు.. శ్రీకాళహస్తిలో బియ్యపు రెడ్డి. అరాచకాలకు అంతు లేదు.. రూ. 2 వేల కోట్లు దోచుకున్నారు.. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి దేవుడినే మోసం చేస్తున్నారు.. మరో అధికారి వెంకటేశ్వర స్వామి అడ్డుపెట్టుకొని.. కేసుల కోసం పైరవీ చేస్తున్నారు.. ఇవన్నీ పోవాలంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిపునిచ్చారు చంద్రబాబు నాయుడు.