Site icon NTV Telugu

Asha Workers Protest: ‘ఛలో విజయవాడ’.. ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు!

Asha Workers Protest

Asha Workers Protest

తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు రాజమండ్రి నుండి ‘ఛలో విజయవాడ’కు బయలుదేరారు. ఛలో విజయవాడకు బయల్దేరిన పలువురు ఆశా వర్కర్లను రైల్వేస్టేషన్‌లో టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్లు చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై ఆశా వర్కర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల వయోపరిమితిని రెండు సంవత్సరాలకు పెంపు, మెటర్నిటీ లీవులు మంజూరు చేసింది. అయినప్పటికీ ఇవేవీ మాకొద్దు.. జీతాలే పెంచండి అంటూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. రైళ్లు, బస్సుల్లోచలో విజయవాడకు బయలుదేరారు. చలో విజయవాడకు వెళ్లడానికి రైల్వే స్టేషన్, బస్టాండ్‌లకు వచ్చిన ఆశా వర్కర్ల పేర్లను పోలీసులు నమోదు చేసుకుని.. తిరిగి ఇంటికి పంపించి వేస్తున్నారు.

మరోవైపు విజయవాడ ధర్నాచౌక్‌లో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. దాదాపుగా పదిహేను వందల మంది వరకూ ధర్నాచౌక్‌ చేరుకున్నారు. వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ వయసు సంబంధించిన జీఓలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ పనులకు ఇచ్చిన ఫోన్‌లు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మార్చాలని, రికార్డులు కొనుక్కునే పని లేకుండా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వంలో అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన నిర్ణయాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశా వర్కర్లు రోడ్డు మీద సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్లు అన్ని జిల్లాల నుంచీ ధర్నాచౌక్‌కు చేరుకుంటున్నారు. ఆశా వర్కర్ల కదలికలను డ్రోన్లు, ఇంటిలిజెన్స్ టీంల ద్వారా పోలీసులు కనుగొంటున్నారు. ధర్నాచౌక్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Exit mobile version