NTV Telugu Site icon

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్!

Govt Issues High Risk Warning For Google Chrome Users In India: కేంద్ర ప్రభుత్వ సైబర్‌ భద్రత సంస్థ ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌)’ గూగుల్‌ క్రోమ్‌ యూజర్లను అప్రమత్తం చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లోని పలు లోపాల కారణంగా మీ డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ను సైబర్‌ నేరగాళ్లు రిమోట్‌గా యాక్సెస్‌ చేయొచ్చని హెచ్చరించింది. పాత వెర్షన్‌లు హ్యాకింగ్ ప్రయత్నాలకు గురయ్యే అవకాశం ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. హ్యాకర్లు మీ కంప్యూటర్ సిస్టమ్‌ను నియంత్రించడానికి, మీ డేటాను దొంగిలించడానికి లేదా మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పింది.

డెస్క్‌టాప్‌లలో గూగుల్‌ క్రోమ్‌ విండోస్‌, మ్యాక్‌ వెర్షన్‌ 124.0.6367.201/ .202.. లైనక్స్‌ 124.0.6367.201 కంటే ముందు వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తున్న వారికి ఈ ముప్పు పొంచి ఉందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. విజువల్స్, గ్రాఫిక్స్ మరియు ఆడియోకు సంబంధించిన భాగాలలో హ్యాకర్లు మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చని.. దాంతో మీ సిస్టమ్ మెమరీని హ్యాకింగ్ చేస్తారని పేర్కొంది. మీ సిస్టమ్‌లోని సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టే ప్రమాదం ఉందని సెర్ట్‌-ఇన్‌ తన హెచ్చరికల్లో పేర్కొంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. వెంటనే గూగుల్‌ క్రోమ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

Also Read: CSK vs RR: రాజస్థాన్‌పై విజయం.. చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!

యాపిల్ ఐట్యూన్స్ వాడే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సెర్ట్‌-ఇన్‌ హెచ్చరించింది. వెంటనే లేటెస్ట్‌ వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఐట్యూన్స్ ఓపెన్ చేసి.. హెల్ప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ ఫర్ అప్‌డేట్‌ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే.. మీ ఐట్యూన్స్ అప్‌డేట్‌ అవుతుంది. గూగుల్‌ క్రోమ్‌ అయితే ఎగువ కుడి మూలలో ఉన్న మూడు నిలువు చుక్కలను క్లిక్ చేయాలి. హెల్ప్ ఆప్షన్ క్లిక్ చేస్తే.. ఏబౌట్ గూగుల్‌ క్రోమ్‌ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అప్‌డేట్‌ అవుతుంది.