NTV Telugu Site icon

Central Govt: ఎస్సీ వర్గీకరణకు కేంద్రం మద్దతు.. వివక్షకు గురైన వర్గాలకు న్యాయం జరగాలి..

Supreme Court

Supreme Court

Central Govt: తమ విభేదాలను పక్కనబెట్టి, షెడ్యూల్డ్ కులాల కోటాలో రిజర్వేషన్లు నిరుపేదలు, అత్యంత బలహీన వర్గాలకు రిజర్వేషన్లలో ఎక్కువ వాటాను అందజేస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం ఏకగ్రీవంగా సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం అభిప్రాయపడింది. సామాజిక స్థితిని మెరుగుపడిన వ్యక్తులు రిజర్వేషన్‌లో ఎక్కువ వాటా పొందకుండా నిరోధించబడతారని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్ల ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదన్న 2004 నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, సీనియర్ న్యాయవాదులు వాదించారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

Read Also: Nikki Haley: భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించడమేనని చిన్నయ్య తీర్పు పేర్కొంది. ఆర్టికల్‌ 341 ప్రకారం ప్రెసిడెన్షియల్‌ లిస్ట్‌లో చేర్చిన ఎస్సీ, ఎస్టీ జాబితాల్లోని కులాల్లో మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని చిన్నయ్య తీర్పు స్పష్టం చేసింది. అయితే, 2004 తీర్పులో లోపాలున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఎస్సీ జాబితాలోని కులాల్లోనూ ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన వ్యత్యాసాలు ఉన్నాయని వెల్లడించారు. వారిలోనూ బాగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంసల్లో ప్రవేశాలు దక్కేలా రిజర్వేషన్లను సహేతుకంగా పునఃపంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని తుషార్‌ మెహతా వివరించారు. విస్తృత ధర్మాసనంలో జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర మిశ్ర సభ్యులుగా ఉన్నారు. చిన్నయ్య తీర్పు షెడ్యూల్డ్ కులాల మధ్య తీవ్ర అసమానతలను విస్మరించిందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు. కేంద్రం, పార్లమెంటు ఒక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చిన తర్వాత, సమూహాల మధ్య కోటాను హేతుబద్ధీకరించడం ద్వారా ఈ వర్గాల మధ్య అసమానతలను తొలగించడానికి చర్యలు తీసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇవ్వాలని అటార్నీ జనరల్ అన్నారు.

Read Also: Antibiotics: యాంటీబయాటిక్స్‌ని అనవసరంగా వాడకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఎస్సీ వర్గాల ఉప-వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడంపై సందిగ్ధతకు ఆస్కారం లేకుండా చేస్తూ, వందల ఏళ్లుగా వివక్షకు గురవుతున్న వారికి సమానత్వం కల్పించేందుకు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌ను కేంద్రం నిశ్చయాత్మక చర్యగా పరిగణిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. రిజర్వేషన్ విధానాన్ని ప్రకటించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం తరఫున తుషార్‌ మెహతా సుప్రీంకోర్టులో తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్య స్థాయిలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని అన్ని కులాలు ఏకస్థితిని కలిగి ఉన్నాయని భావించలేమని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఓ ప్రత్యేక ప్రయోజనం కోసం రాజ్యాంగంలో ఈ రెండు వర్గాలు సజాతీయతను కలిగి ఉన్నాయని పేర్కొన్నారని.. అన్నింటిని దానికి వర్తింపజేయలేమని పేర్కొంది. ఈ కోణంలో 2004 తీర్పులోని అంశాంలను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం వెల్లడించింది. రాష్ట్రాల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఆయన కూడా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోని కులాల మధ్య కూడా సమానత్వానికి కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీల్లోని అన్ని సామాజిక వర్గాల స్థితిగతులు ఒకే తీరుగా ఉన్నాయని చెప్పలేమని తెలిపారు. ఈ విషయంపై ఇవాళ(గురువారం) కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగనుంది.