NTV Telugu Site icon

Lok sabha: మాల్‌ప్రాక్టీస్‌‌పై కేంద్రం ఉక్కుపాదం.. లోక్‌సభలో బిల్లు

Jail

Jail

పోటీ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

 

నిరుద్యోగుల బలహీనతలను కొందరు ఆసరాగా చేసుకుని మాఫీయాలు రెచ్చిపోతుంటాయి. అక్రమార్గాల్లో విద్యార్థులను తప్పుదోవపట్టిస్తుంటాయి. ఇంకొందరైతే ఒకరి స్థానంలో మరొకరితో పరీక్ష రాయించి గట్టెక్కిస్తుంటారు. ఇలా రకరకాలుగా పోటీ పరీక్షల్లో అక్రమంగా ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. అర్హులు కాకుండా అనర్హులు ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటూ.. ఉద్యోగమే లక్ష్యంగా చదువుకున్న వాళ్లు మాత్రం అన్యాయానికి గురవుతుంటారు. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్‌లో బిల్లు తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో కేంద్రం ప్రవేశపెట్టింది. నేరం గనుక రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనుంది.

ఈ బిల్లుతో ముఠాలు, మాఫియాపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వారితో చేతులు కలిపే ప్రభుత్వ అధికారులను కూడా కఠినంగా శిక్షించనున్నారు. గుజరాత్‌, బిహార్‌, రాజస్థాన్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల (Malpractices) కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో కేంద్రం ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. యువతకు భరోసా ఇచ్చేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని.. విద్యార్థుల లక్ష్యంగా ఈ బిల్లు తీసుకురాలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించారు. పరీక్షల్లో అవకతవకల విషయంలో యువత ఆందోళన ప్రభుత్వానికి తెలుసని, ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించేందుకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని వెల్లడించారు.

తెలంగాణలో కూడా టీఎస్‌సీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీంతో ఆ పరీక్షలన్నీ రద్దు చేయబడ్డాయి. అక్రమాలకు పాల్పడ్డ నిందితులంతా జైల్లో మగ్గుతున్నారు. ఇక రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత టీఎస్‌పీఎస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశారు.