Site icon NTV Telugu

National Highway Projects: తెలంగాణలో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం.. రూ.10,034 కోట్లతో..

Telangana

Telangana

మెరుగైన రోడ్లు రాష్ట్రాలు, దేశాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. రోడ్లు రవాణాకు అత్యంత ముఖ్యం. వీటి ద్వారా ప్రజలు, వస్తువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వీలుకలుగుతుంది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచడంలో, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో రోడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంపై వరాలు కురిపించింది. తెలంగాణలో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన అఫీషియల్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Also Read:DGCA Emergency Advisory: విమానయాన సంస్థలకు DGCA అత్యవసర సలహా..

కిషన్ రెడ్డి పోస్టు చేసిన పోస్టులో.. తెలంగాణలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు కీలక జాతీయ రహదారుల విస్తరణకు ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణ జిల్లాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అదించడంతో పాటు ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థికాభివృద్ధికి దోహదపడనున్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2015 వరకు తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరగితే గత 10 ఏళ్లలో తెలంగాణలో 5వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని వెల్లడించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయని తెలిపారు.

నాలుగు నేషనల్ హైవేలు

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 271 కిలోమీటర్ల మేర నాలుగు భారీ ప్రాజెక్టులు నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది.

మహబూబ్నగర్ నుంచి గూడెబల్లూర్ ఎన్ హెచ్167

కేంద్రం త్వరలో ప్రారంభించనున్న ఆ నాలుగు ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే.. ఎన్ హెచ్167.. మహబూబ్నగర్ నుంచి గూడెబల్లూర్. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగమైన ఈ 80కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించడానికి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. రూ. 2,662 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

ఆర్మూరు జగిత్యాల ఎన్ హెచ్ 63

ఎన్ హెచ్ 63.. ఆర్మూరు జగిత్యాల నేషనల్ హైవే. ఈ సెక్షన్ లోని జాతీయ రహదారి విస్తరణ పనులు చేయడానికి కేంద్రం సంకల్పించి టెండర్లను ఆహ్వానించింది. 64 కిలోమీటర్ల ఈ మార్గాన్ని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. రూ.2,338 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

జగిత్యాల మంచిర్యాల ఎన్ హెచ్ 63

ఎన్ హెచ్ 63 జగిత్యాల మంచిర్యాల.. 68 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. రూ. 2,550 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

Also Read:Hydrogen Balloons: పిచ్చండి.. పిచ్చి.. హల్దీ వేడుకలో పేలిన హైడ్రోజన్ బెలూన్లు.. వధూవరులకు గాయాలు..

జగిత్యాల కరీంనగర్ ఎన్ హెచ్ 563

ఇక మరొక నేషనల్ హైవే ప్రాజెక్ట్ జగిత్యాల కరీంనగర్ ఎన్ హెచ్ 563.. 59 కిలోమీటర్ల ఈ మార్గాన్ని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. రూ. 2,484 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

Exit mobile version