Site icon NTV Telugu

Amaravati: అమరావతే ఏపీ రాజధాని.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం..

Amaravati

Amaravati

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై మరోసారి కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సిద్ధం అవుతోన్న సమయంలో.. కేంద్ర ప్రకటన ఆసక్తికరంగా మారింది.. అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది కేంద్రం.. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది.. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది.

Read Also: Supreetha: నేనేం అన్యాయం చేశా.. నన్నెందుకు వేధిస్తున్నారు.. సురేఖావాణి కూతురు పోస్ట్ వైరల్

దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ ప్రశ్నించారు. అయితే, ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇస్తూ.. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం అన్నారు. ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని పేర్కొంది కేంద్రం.. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాలు మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు ఈ సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. కాగా, చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించినా.. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత మూడు రాజధానుల విధానంతో ముందుకు సాగుతున్నారు.. అందులో భాగంగా.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతి.. శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయించిన విషయం విదితమే.

Exit mobile version