దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయాణంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) కింద కేంద్ర ఉద్యోగులు ఇప్పుడు తేజస్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ వంటి లగ్జరీ రైళ్లలోను ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సౌకర్యం ద్వారా ఉద్యోగులు తాము అర్హత ఉన్న రైళ్లలో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎల్‌టిసి కింద ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రాజధాని, శతాబ్ది రైళ్లతోపాటు, తేజస్, వందే భారత్, హమ్‌సఫర్ వంటి రైళ్లను కూడా జోడించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల నుండి వచ్చిన సూచనల అనంతరం తీసుకున్నట్లు డిఒపిటి తెలిపింది.
Also Read: Manchu Family : నేను గొడవలు చేయడానికి రాలేదు : మంచు మనోజ్
ఎల్‌టిసి కింద ప్రయాణించే ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు పొందుతారు. అలాగే ప్రయాణ టిక్కెట్లకు సంబంధించిన ఖర్చును కూడా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఉద్యోగులు నాలుగేళ్లకు ఒకసారి ఎల్‌టిసి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది దేశంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఎల్‌టిసి కింద రైళ్లతో పాటు, విమాన ప్రయాణానికి కూడా మినహాయింపు ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు, జమ్మూ-కశ్మీర్, లడఖ్ ప్రయాణించే ఉద్యోగులకు సెప్టెంబర్ 25, 2026 వరకు విమాన ప్రయాణంపై మినహాయింపు ఇవ్వబడింది. అయితే, విమాన ప్రయాణానికి అర్హత కలిగిన ఉద్యోగులు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందగలరని డిఒపిటి స్పష్టం చేసింది.
Also Read: Viral Video: ఎంత తింటావ్ తిను.. అవినీతి అధికారిపై నోట్లు విసిరిన ప్రజలు
ఈ విధానం ప్రధానంగా ఉద్యోగులు తమ కుటుంబాలతో సమయాన్ని గడిపేందుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టిక్కెట్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించడం వల్ల, ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న ఈ ప్రయోజనాలు వారికి మరింత ఆధ్యాత్మిక శాంతిని, కుటుంబ సమైక్యతను అందించడానికి సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.