Central Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) రియాక్షన్ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు.. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి పోలీస్ అధికారులపై కూడా వేటు వేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త FIR రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ.. సీఎస్, డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించింది.
కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత మొదలైన గొడవల ఇష్యూ ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై రిపోర్టు ఇవ్వాలన్న ఆదేశంలో.. ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీలు హరీశ్ కుమార్ గుప్తాలు ఈసీఐ అధికారులతో భేటీ అయ్యారు. దాదాపు అర గంట పాటు అధికారులతో సమావేశం జరిగింది. పూర్తి వివరాలతో కూడిని రిపోర్ట్‌ను ఈసీకి అందించారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గొడవలను అరికట్టడంలో విఫలమైనందుకు సీఎస్, డీజీపీపై మండిపడింది. హింసకు తావు లేకుండా చూడాలని గతంలో ఈసీ పలు మార్లు హెచ్చరించినా చర్యలు తీసుకోక పోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవర్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి? అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై రిపోర్టు ఇచ్చారు. ఇక, కాస్త సమయం తీసుకుని చర్యలకు దిగింది కేంద్ర ఎన్నికల కమిషన్.