Andhrapradesh: ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో సీఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ జాబితా సవరణ-2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు, రేపు సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఈ సమీక్షకు హాజరుకానున్నారు. విజయవాడలోని నోవాటెల్‌లో నేడు, రేపు ఈ సమావేశం జరగనుంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also: CM Revanth Reddy Protest: నేడు ఇందిరా పార్క్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ధర్నా
జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చ జరపనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం.. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల బృందం చర్చించనుంది. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై అధికార-ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించే అవకాశం కనిపిస్తోంది.
