Site icon NTV Telugu

Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు

Arvind Kejriwal

Arvind Kejriwal

Delhi Liquor Scam: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్‌లో సరికొత్త సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ కనుగొన్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు అవే మూలాధారాలని సీబీఐ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రిని సీబీఐ విచారణకు పిలవడం బహుశా ఇదే మొదటిసారి. అయితే, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం సీబీఐ సమన్లపై ఇంకా స్పందించాల్సి ఉంది. గతంలో మాత్రం లిక్కర్ స్కాం లాంటిదేమీ లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మంత్రి మోడీని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శిస్తున్నందునే, కక్షతో వేధిస్తున్నారని ఆప్ విమర్శిస్తోంది. ఆప్‌కు చెందిన ఏ ఒక్క నాయకుడు ఇలాంటి ఆరోపణలకు భయపడేది లేదని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. చాలా మంది ఆప్ మంత్రులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని గతంలో కూడా వేధించారు. మోడీకి, అవినీతికి వ్యతిరేకంగా, మా పోరాటం ఆగదని, కొనసాగుతుందని ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించారు.

 

ఇదే కేసులో జైలులో ఉంటూ ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విచారణ ఎదుర్కొంటున్నారు. తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవలే ఈడీ ప్రశ్నించింది. ఢిల్లీలో అసలు లిక్కర్ స్కాం జరగలేదని కేజ్రీవాల్ అంటున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎనిమిది గంటల పాటు విచారించిన అనంతరం ఆయనను అరెస్టు చేశారు. కొత్త ఎక్సైజ్ పాలసీ వల్ల ప్రైవేట్ మద్యం వ్యాపారులకు ‘అనవసర ప్రయోజనాలు’ లభిస్తాయన్న ఆరోపణలపై గతేడాది జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆ తర్వాత ఆగస్టులో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పంజాబ్‌లోని 20కి పైగా ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేసింది. మనీష్ సిసోడియా ఇంటిపై కూడా దాడులు జరిగాయి.

Read Also: Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కుప్పకూలిన పాదచారుల వంతెన.. 80 మందికి గాయాలు

సీబీఐతో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను ప్రశ్నించింది. ఈ పాలసీ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరెవరితో మాట్లాడారు లేదా కలిశారని అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. బిభవ్, సిసోడియా, ఇతరులు ఎక్సైజ్ పాలసీ కేసులో వేల కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌లను స్వీకరించడానికి 170 ఫోన్‌లను ఉపయోగించారని, నాశనం చేశారని, మార్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆప్ నేత జాస్మిన్ షాను కూడా ఈడీ ప్రశ్నించింది. బిభవ్ లాగానే, జాస్మిన్ షా కూడా ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమావేశాలపై ప్రశ్నించబడింది. జాస్మిన్ షా ఢిల్లీ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ వైస్ ఛైర్‌పర్సన్. ప్రైవేట్ డిస్కమ్ బోర్డు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తొలగించిన నలుగురిలో ఆమె ఒకరు.

Exit mobile version