Mallareddy: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదైంది.. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 33,34,35 లో 47 ఎకరాల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి భూమిని కాజేశారని బాధితులు మీడియా ముందు వెల్లడించారు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసినట్లు వారు తెలిపారు. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
Read Also: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు..
2004 నుంచి కేసు కోర్టులో నడుస్తుందని… కొవిడ్ తర్వాత కోర్టులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చినా తెలియనివ్వలేదని.. చివరకు ఈ ఏడాది అక్టోబర్‌లో భూమి ఇప్పిస్తామని చెప్పి మాతో సంతకాలు చేయించుకున్నారని బాధితులు వాపోయారు. పీటీ సరెండర్ పేరుతో నిరక్షరాస్యులమైన మాతో అప్పుడు మంత్రిగా ఉన్న మల్లారెడ్డి, అతని అనుచరులు సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. మాకు తెలియకుండానే మా భూమిని తీసుకున్నారని వారు పేర్కొన్నారు. ఎమ్మార్వో మమ్మల్ని మోసం చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా భూమి మాకు ఇప్పించాలని శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
