మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోళ్లదిన్నెకు చెందిన టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్.. కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు. ఆయనపై 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also Read: CM Chandrababu: దావోస్‌లో సీఎం చంద్రబాబు మూడవ రోజు పర్యటన.. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు!
ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు తీవ్రంగా గాయపడడంతో.. వారిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి ఆవరణలోనే మరోసారి దాడులు చేసుకున్నారు. వైసీపీ నేతలను పరామర్శించేందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని, పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ కాకాణి పరుష పదజాలం వాడారు. టీడీపీ నేతలను వదిలేది లేదంటూ బహిరంగంగా అన్నారు. కాకాణి వ్యాఖ్యలపై ప్రసన్న కుమార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.