NTV Telugu Site icon

Singer Mano Sons: సింగర్ మనో కుమారులపై కేసు నమోదు.. గాలిస్తున్న చెన్నై పోలీసులు!

Singer Mano Sons

Singer Mano Sons

Case registered against Singer Mano Sons in Chennai: ప్రముఖ సింగర్ మనో కుమారులపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో మనో కుమారులు తన స్నేహితులతో కలిసి ఇద్దరు యువకులపై దాడి చేయగా.. వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో మనో కుమారులు ఇద్దరు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మనో మేనేజర్, ఇంటి పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్‌ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి ట్రైనింగ్ అయ్యాక అకాడమీ నుంచి బయటికి వచ్చి.. వలసరవాక్కంలోని ఓ హోటల్‌లో డిన్నర్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో గాయకుడు మనో కుమారులు రఫీ, షకీర్‌లతో పాటు మరో ముగ్గురు స్నేహితులు హోటల్‌లోనే ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఈ ఐదుగురు కృపాకరన్‌తో గొడవపడ్డారు. గొడవ ఎక్కువగా కావడంతో.. ఈ ఐదుగురు ఆ ఇద్దరిపై దాడి చేశారు. గాయపడిన కృపాకరన్‌ను స్థానికులు కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.

Also Read: IPL 2025-RCB: అతడిని జట్టులోకి తీసుకోవడం దండగ: మాజీ క్రికెటర్

కృపాకరన్ ఫిర్యాదు మేరకు వళసరవాక్కం పోలీసులు గాయకుడు మనో కుమారులు సహా వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఐదుగురిలో ఇద్దరు అరెస్టు కాగా.. మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో మనో మేనేజర్, ఇంటి పని మనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మనో కుమారులు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Show comments