NTV Telugu Site icon

Australian Open 2025: దూసుకెళ్తున్న అల్కరాస్‌.. యుకి, బోపన్న జోడీలు ఔట్‌!

Carlos Alcaraz Speech

Carlos Alcaraz Speech

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025లో నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ కార్లోస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) దూసుకెళ్తున్నాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో 6-0, 6-1, 6-4తో యోషిహిటో నిషియోకా (జపాన్‌)పై సునాయాసంగా గెలిచాడు. అల్కరాస్‌ జోరు ముందు తొలి రెండు సెట్లలో తేలిపోయిన జపాన్‌ ఆటగాడు.. మూడో సెట్లో కాస్త పోటీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ ప్లేయర్ 14 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. అల్కరాజ్‌ జోరు చూస్తుంటే.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఖాతాలో పడడం ఖాయంగా ఉంది.

టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్లో 6-1, 6-7 (4), 6-3, 6-2తో జైమీ ఫారియా (పోర్చుగల్‌)పై గెలిచాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓ సెట్‌ను కోల్పోయిన జకో.. ఆపై పుంజుకుని విజయం సాధించాడు. కెరీర్‌లో జకోవిచ్‌కు ఇది 430వ మ్యాచ్‌. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా జకో రికార్డు సృష్టించాడు. రోజర్ ఫెదరర్‌ (429)ను జకో అధిగమించాడు. ఇక రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-1, 6-4, 6-1తో మార్టినెజ్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు.

మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ గాఫ్ మూడో రౌండ్లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో 6-3, 7-5తో బురాగె (బ్రిటన్‌)పై గెలిచింది. ఏడో సీడ్‌ పెగులా (అమెరికా) 6-4, 6-2తో మెర్టెన్స్‌ (బెల్జియం)ను ఓడించింది. ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంక (బెలారస్‌) రెండో రౌండ్‌లో 6-3, 7-5తో బౌజాస్‌ మనీరో (స్పెయిన్‌)పై విజయం సాధించింది. ఒసాకా (జపాన్‌) 1-6, 6-1, 6-3తో ముచోవా (చెక్‌)పై, పవ్లిచెంకోవా (రష్యా) 7-6 (7-2), 6-2తో పొటపోవా (రష్యా)పై గెలుపొందారు. భారత ఆటగాళ్లు యుకి బాంబ్రి, రోహన్‌ బోపన్న డబుల్స్‌లో తొలి రౌండ్‌ దాటలేకపోయారు.

Show comments