NTV Telugu Site icon

Carbide Free Mango : ‘కార్బైడ్‌ రహిత మామిడి మేళా’ను ప్రారంభించిన వనజీవి రామయ్య

Vanajivi Ramaiah

Vanajivi Ramaiah

ఖమ్మంలో బుధవారం ‘కార్బైడ్‌ రహిత మామిడి మేళా’ను వనజీవి రామయ్య ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన రైతు బానోతు లక్ష్మణ్‌నాయక్‌ పెవిలియన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న మేళాలో సహజసిద్ధంగా పండిన వివిధ రకాల మామిడి పండ్లను సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తున్నారు. మేళాను ప్రారంభించిన అనంతరం రామయ్య మాట్లాడుతూ కార్బైడ్ రహిత మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని, కృత్రిమ పదార్థాలతో పండిన మామిడి పండ్లను నివారించాలని, అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అన్నారు. 2013లో అప్పటి ఖమ్మం కలెక్టర్ సిద్ధార్థజైన్, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డిల ప్రోత్సాహంతో కార్బైడ్ రహిత మామిడి మేళాను ప్రారంభించినట్లు లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ప్రజల మద్దతుతో ఈ ఏడాది మేళా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా మామిడి పండ్లను రైపనింగ్ ఛాంబర్లలో పండిస్తారు. చిన్న రసాలు, బంగినపల్లి, చెరుకురసం, దశేరి, హిమాయత్, పెద్దరసాలు, సువర్ణరేఖ, అల్ఫోన్సో, మల్లిక, తెల్ల గులాబీ, జలాలు, నీలం తదితర మామిడి రకాలు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. 10 కిలోల పండ్లు కొనుగోలు చేసిన వారికి ఒక కిలో పండ్లను ఉచితంగా అందజేస్తామని, 45 రోజుల పాటు మేళా నిర్వహిస్తామని లక్ష్మణ్ నాయక్ తెలిపారు.