Road Accident: రోజుకు రోడ్డు ప్రమాదాలు వేల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. అయినా బండి తీయకు తప్పదు.. రోడ్డెక్కక తప్పదు. ఒకరు చేసిన పొరపాటుకు మరొకరు బలవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అతి వేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, వాహనాలు సరిగా నడపక పోవడం ఇలాంటి పొరపాట్ల వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. రోజుకు వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Read Also: Virat Kohli Fan: విరాట్ కోహ్లీ నా మనసు గాయపరిచాడు: పాకిస్థాన్ యువతి
వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం యర్రదొడ్డి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు బుక్కపట్నం మండలం మధిరేబైలు తాండాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మృతుల పేర్లు భాస్కర్ నాయక్, చిన్నస్వామి నాయక్ ,చలపాతి నాయక్ గా గుర్తించారు. మృతుల్లో చిన్నస్వామి నాయక్ మదిరేబైలు పంచాయతీ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. కారు రాంగ్ రూట్లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.