NTV Telugu Site icon

Supreme Court: “గర్భంలో పిండానికి కూడా జీవించే హక్కు ఉంటుంది”.. అవివాహిత పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

Supreme Court

Supreme Court

Supreme Court: గర్భంలోని పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలని 20 ఏళ్ల అవివాహిత దాఖలు చేసిన పిటిషన్‌ని స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఈ రోజు నిరాకరించింది. మే 3న తన గర్భాన్ని తొలగించేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మేము చట్టానికి విరుద్ధంగా ఏ ఉత్తర్వులను జారీ చేయలేము అని ధర్మాసనం స్పష్టం చేసింది.

కడుపులో ఉన్న బిడ్డకు కూడా జీవించే హక్కు ఉంటుందని, దాని గురించి మీరు ఏం అంటారు..? అని మహిళ తరుఫు న్యాయవాదిని ప్రశ్నించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం కేవలం తల్లి గురించి మాత్రమే మాట్లాడుతుందని మహిళ తరఫు న్యాయవాది తెలిపారు. ఇది తల్లుల కోసం తయారు చేయబడిందని చెప్పారు. గర్భం దాల్చి 7 నెలలకు పైగా అయిందని ధర్మాసనం పేర్కొంది. పిల్లల మనుగడ హక్కు పరిస్థితి ఏంటి..? దీనిని మీరు ఎలా పరిష్కరిస్తారు..? అని బెంజ్ ప్రశ్నించింది. పిండం కడుపులో ఉందని, బిడ్డ ప్రసవించే వరకు అది తల్లి హక్కు అని న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు.

Read Also: Rameez Raza: టీ20 వరల్డ్ కప్కు పాకిస్తాన్ జట్టును ప్రకటించకపోవడంపై ఆగ్రహం..

‘‘ఈ దశలో పిటిషనర్ తీవ్రమైన బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారని, ఆమె బయటకు కూడా రాలేదు, ఆమె నీట్ పరీక్ష కోసం క్లాసెస్‌కి వెళ్తుందని, ఆమె చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నారు. ఆమె ఈ దశలో సమాజాన్ని ఎదుర్కోలేకపోతోంది’’ అని న్యాయవాది చెప్పారు. ఆమె మానసిక, శారీరక శ్రేయస్సును పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది వాదించారు. ఏప్రిల్ 25న పిండం, పిటిషనర్ పరిస్థితిని నిర్ధారించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్‌ని ఆదేశించామని, మే 3న తన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.

మెడికల్ బోర్డు నివేదిక ప్రకారం.. పిండంలో పట్టుకతో వచ్చే అసహజత ఏం లేదని, గర్భాన్ని కొనసాగించడం వల్ల తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని హైకోర్టు పేర్కొంది. కాబట్టి భ్రూణ హత్య నైతికంగా, చట్టపరంగా అనుమతించబడదు అని చెప్పింది. పిటిషనర్ హైకోర్టు ముందు తన కడుపులో అసౌకర్యంగా అనిపించిందని ఏప్రిల్ 16న పేర్కొంది. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయగా, ఆమె 27 వారాల గర్భవతి అని తేలింది. ఇది చట్టబద్ధంగా అనుమతించే 24 వారాల పరిమితిని దాటిపోయింది. MTP చట్టం ప్రకారం, వైద్య బోర్డు ద్వారా పిండం అసాధారణంగా ఉండటం లేదా తల్లికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మాత్రమే 24 వారాల కన్నా ఎక్కువ వ్యవధి గర్భాన్ని రద్దు చేయడానికి అనుమతించబడుతుంది.