Site icon NTV Telugu

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని దిగ్భ్రాంతి.. 280 మందికిపైగా దుర్మరణం

Canada Pm

Canada Pm

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, మంత్రులు, దేశ రాయబారులు సందేశాలు పంపుతున్నారు. ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్‌ ట్రుడో ఒక ట్వీట్‌ చేశారు.అలాగే తైవాన్‌ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్‌ వెన్‌ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం, క్షతగాత్రులకు సానుభూతి ప్రకటించారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు రష్యా అంబాసిడర్‌ డెనిస్‌ అలిపొవ్‌ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read Also: Odisha Train Accident LIVE UPDATES: మాటలకందని మహా విషాదం.. ఘటనాస్థలానికి ప్రధాని మోడీ!

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 280 మందికిపైగా దుర్మరణం చెందారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.

5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తమిళనాడు సీఎం
ఈ ప్రమాదంలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడుకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు తమిళనాడుకు చెందిన 35 మంది మరణించినట్లు గుర్తించారు. గాయపడిన 50 మంది బాధితులను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. రైలు ప్రమాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్న సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

Exit mobile version