NTV Telugu Site icon

Canada: భారత్‌తో చెలగాటమాడిన కెనడా పరిస్థితి ఆగమాగం.. అమెరికా సాయం చేస్తుందా?

Canada

Canada

మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా కాబోతున్న డొనాల్డ్ ట్రంప్.. కెనడాను తమ దేశంలో 51వ ప్రావిన్స్‌గా మార్చాలని సరదాగా మాట్లాడారు. అయితే నేడు కెనడా ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నది వాస్తవం. భారీ పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ చేసిన ఈ జోక్‌ను రియాలిటీగా మార్చడం గురించి కెనడాలో చాలా మంది చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కెనడాలో ఇంటి కోసం తీసుకున్న రుణం దాని జీడీపీలో 103 శాతానికి చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. గృహ రుణం అంటే కుటుంబ సభ్యులు చెల్లించాల్సిన మొత్తం రుణం. ఇందులో వినియోగదారు రుణాలు, తనఖా రుణాలు కూడా ఉన్నాయి.

క్షీణించిన కెనడా ఆర్థిక వ్యవస్థ…
ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. బడ్జెట్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి ఫ్రీలాండ్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా తర్వాత పార్టీలో ట్రూడో రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తీవ్రం చేసింది. ఇప్పుడు ట్రూడో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం రెండు నెలల సేల్స్ ట్యాక్స్ హాలిడేను ప్రకటించింది. ఫ్రీలాండ్ దీనిని వ్యతిరేకించారు. ఇది చాలా ప్రమాదమైనదిగా ఆమె పేర్కొన్నారు. 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇలాంటి వృథా ఖర్చులను నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం పెను సవాలును ఎదుర్కొంటోందని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టారిఫ్ వార్‌ను ఎదుర్కోవాలంటే మనం డబ్బు ఆదా చేసుకోవాలని సూచించారు.

కెనడాను బెదిరించిన ట్రంప్..
ఇదిలా ఉండగా.. కెనడాపై 25 శాతం సుంకం విధిస్తానని ట్రంప్‌ బెదిరించారు. ట్రంప్ 25 శాతం టారిఫ్‌ను అమలు చేస్తే, అది కెనడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కెనడా అమెరికాలో 51వ ప్రావిన్స్‌గా మారాలని చాలా మంది కెనడియన్లు కోరుకుంటున్నారని ట్రంప్ ఇటీవల తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో రాసుకొచ్చారు. దీంతో వారికి భారీ పన్ను ఆదాతోపాటు సైనిక రక్షణ కూడా లభిస్తుందని ఆశిస్తున్నట్లు సమాచారం. ఓ సర్వే ప్రకారం.. కెనడియన్లలో 13 శాతం మంది కెనడా అమెరికాలో ఒక భాగం కావాలని తేల్చేశారట. ఇది మాత్రమే కాదు.. ట్రంప్ ట్రూడోను ప్రధానికి బదులుగా గవర్నర్ అని పిలిచారు.

భారత్-కెనడాకు మధ్య విభేదాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

2023 జూన్ 18న ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ను బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వద్ద దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య భారత్ పనేనని, దానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ అదే ఏడాది సెప్టెంబర్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఏడాది తర్వాత మరోసారి ట్రూడో ప్రభుత్వం భారత్ వ్యతిరేక వైఖరిని కనబర్చింది. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమినర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చిన కెనడా సర్కారు.. ఆయన్ను విచారించాలంటూ భారత విదేశాంగ శాఖకు సందేశం పంపించింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా.. కెనడా నుంచి మన దౌత్యాధికారులను వెనక్కి రావాలని ఆదేశించింది. అలాగే మన దేశంలోని కెనడా హైకమిషనర్ వీలర్ సహా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. తమ దేశ పౌరులను హత్య చేసేందుకు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను భారత్ ఉపయోగించు కుంటోందంటూ కెనడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఇక్కడే ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి కారణమైంది.