Site icon NTV Telugu

Ayatollah Ali Khamenei: ఈ ముస్లిం దేశ సుప్రీం లీడర్‌ను అమెరికా కిడ్నాప్ చేయగలదా?

Ayatollah Ali Khamenei

Ayatollah Ali Khamenei

Ayatollah Ali Khamenei: ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తన సొంత దేశంలో అమెరికా అరెస్టు చేయడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముస్లిం దేశ సుప్రీం లీడర్ అమెరికా అచ్చం అలాగే అరెస్ట్ చేయగలదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. ఇరాన్. ఈ ముస్లిం దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. ఇప్పుడు ఇరాన్ వీధుల్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి, అలాగే సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా బహిరంగంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి టైంలో వెనిజులా ఘటన ఇరాన్ అధికార కారిడార్లలో హెచ్చరిక గంటలు మోగించింది.

READ ALSO: Betelgeuse: పేలేందుకు సిద్ధంగా ‘‘బెటెల్గ్యూస్’’ నక్షత్రం.. హబూల్ లేటెస్ట్ డిస్కవరీ..

దేశంలో నిరసనలు కొనసాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులకు మద్దతుగా జోక్యం చేసుకుంటానని బహిరంగంగా బెదిరిస్తున్న తరుణంలో, దేశంలో పరిస్థితి అదుపు తప్పితే లేదా భద్రతా దళాలు తనను వదిలివేస్తే, 86 ఏళ్ల ఖమేనీ ఇప్పటికే రష్యా రాజధాని మాస్కోకు పారిపోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకున్నాడని బ్రిటిష్ మీడియా తాజాగా పేర్కొంది. అయితే అమెరికా లేదా మరే ఇతర విదేశీ సైనిక శక్తి టెహ్రాన్‌లోకి ప్రవేశించి ఇరాన్ సుప్రీం నాయకుడిని అపహరించడానికి ధైర్యం చేయగలదా అనేది ఒక పెద్ద ప్రశ్న.

పలు నివేదికల ప్రకారం.. ఇరాన్ సైన్యం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను నియంత్రించడంలో విఫలమైతే, లేదంటే భద్రతా దళాలలో చీలిక ఏర్పడితే, ఖమేనీ తన 20 మంది సహాయకులు, కుటుంబ సభ్యులతో సహా దేశం విడిచి వెళ్ళవచ్చని చెబుతున్నాయి. ఇరాన్‌లో మళ్లీ నిరసనలు తీవ్రమవుతున్న సమయంలో ఈ వాదన ప్రపంచం ముందుకు వచ్చింది. అయితే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు 2022-23లో జరిగిన మహ్సా అమినీ ఉద్యమం అంత పెద్దది కానప్పటికీ, ఈ నిరసనలు మొత్తం దేశాన్ని కుదిపేస్తున్నాయి.

ఒక పక్క నిరసనలు, మరొక పక్క అగ్రరాజ్యం భయం కారణంగా ఇరాన్ ఆయతుల్లా ఖమేనీ భద్రతను ఏ సాధారణ సైన్యానికి అప్పగించలేదు. ఈ బాధ్యతను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన అత్యంత ఉన్నత, రహస్య విభాగం అయిన సెపా-ఎ వాలి-యే అమర్ లేదా వాలి-ఎ-అమర్ ఫోర్స్ నిర్వహిస్తుంది. వలి-ఎ-అమర్ అంటే “ఆదేశం ఇచ్చే వ్యక్తి సైన్యం” అని అర్థం. ఇరాన్‌లో దీని అర్థం సుప్రీం నాయకుడి ప్రాణాలను కాపాడటం.

ఈ యూనిట్ 1980ల మధ్యలో స్థాపించారు. నేడు ఈ యూనిట్‌లో దాదాపు 12 వేల మంది ఉన్నత స్థాయి శిక్షణ పొందిన సిబ్బందిని ఉన్నారు. వలీ-ఎ-అమర్ సైనికులు కేవలం ఆయుధాల నైపుణ్యం కలిగి ఉండరు. వారు సైబర్ యుద్ధం, నిఘా, అంతర్గత ముప్పులను గుర్తించడం, వాటిని తొలగించడంలో ఉన్నత స్థాయి శిక్షణ పొందుతారు. దీని అర్థం ముప్పు ఏ రూపంలో ఎదురైనా, ఈ దళం అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉంటుంది. వాలి-ఎ-అమర్ అనేది కేవలం ఒక అంగరక్షక విభాగం మాత్రమే కాదని, ఇరాన్ శక్తికి వెన్నెముక అని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఖమేనీకి ఏదైనా జరిగితే, ఈ దళం అధికార మార్పిడిని త్వరగా, నియంత్రిత పద్ధతిలో నిర్వహిస్తుందని చెబుతున్నారు.

IRNA నివేదికల ప్రకారం.. 2022లో ఈ యూనిట్‌లో ఒక పెద్ద నాయకత్వ మార్పు జరిగింది. బ్రిగేడియర్ జనరల్ హసన్ మష్రుయిఫర్‌ను దాని కొత్త కమాండర్‌గా నియమించారు. జూన్ 13, 2025న ఇజ్రాయెల్ దాడిలో మరణించిన IRGC చీఫ్ హోస్సేన్ సలామీ ఆయనను నియమించారు. గతంలో కమాండర్‌గా పని చేసిన ఇబ్రహీం జబ్బారికి గౌరవప్రదమైన వీడ్కోలు పలికారు. ఆయన గతంలో IRGC బాసిజ్ మిలీషియాకు ఇంటెలిజెన్స్ డిప్యూటీగా పనిచేశారు. ఈ దళానికి సంబంధించిన చాలా సమాచారం నేటికీ చాలా రహస్యంగా ఉంది.

READ ALSO: Peddi Release Date: తగ్గేదే లే అంటున్న ‘పెద్ది’.. అనుకున్న డేట్‌కే రిలీజ్

Exit mobile version