NTV Telugu Site icon

Vinesh Phogat: పీటీ ఉష ఫొటో కోసమే వచ్చారు.. అదో పెద్ద రాజకీయం: వినేశ్‌ ఫొగాట్

Vinesh Phogat Pt Usha

Vinesh Phogat Pt Usha

Vinesh Phogat Fires on PT Usha: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) చీఫ్ పీటీ ఉషపై మాజీ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌ 2024 సమయంలో పీటీ ఉష కేవలం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే తన వద్దకు వచ్చారని విమర్శించారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని, ఫొటో షో కోసమే ఆమె వచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం కారణంగానే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో తీర్పు అనుకూలంగా రాలేదని వినేశ్‌ పేర్కొన్నారు.

2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్‌ ఫొగాట్.. త్రుటిలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. వెయిట్‌ను తగ్గించుకొనేందుకు వినేశ్‌ బాగా కష్టపడ్డారు. ట్రెడ్‌మిల్‌, సౌనా బాత్, జిమ్, ఇతర వ్యాయామాలు చేశారు. ఈ సమయంలో ఆమె ఒక్క చుక్క నీరు కూడా తీసుకోలేదు. దాంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురై.. ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న వినేశ్‌ను కలవడానికి ఐవోఏ చీఫ్ పీటీ ఉష వెళ్లారు. ఆ సమయంలో ఫోగట్‌తో ఉష ఫోటో కూడా దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినేశ్‌ మాట్లాడుతూ.. ఉషపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Also Read: IND vs BAN: పాపం సర్ఫరాజ్‌.. ఎప్పటివరకు ఆగాలో?! అసలే లేటు ఎంట్రీ

‘పీటీ ఉష మేడమ్ నా దగ్గరకు వచ్చి ఫొటో దిగారు. నా ఆరోగ్యం గురించి ఆమె ఏమీ అడగలేదు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదంతా కేవలం షో కోసమే. అదో పెద్ద రాజకీయం. ఫైనల్ అనర్హతపై కాస్‌లో నా పేరు మీదే కేసును ఫైల్‌ చేశా. వాస్తవానికి దేశం పేరుతో చేయాలి. కానీ ప్రభుత్వం, ఐవోఏ నుంచి మద్దతే లేదు. వారు మెడల్‌ను ఎప్పుడో వదిలేసేశారు. హారీశ్‌ సాల్వే కేసు వాదించేందుకు ముందుకు వచ్చారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి మద్దతు దక్కాలి. కానీ వారంతా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యారు. థర్డ్‌ పార్టీగానే కాస్‌లో మేం వాదనలు వినిపించాం. దురదృష్టవశాత్తు అనుకూల ఫలితం రాలేదు’ అని వినేశ్‌ ఫొగాట్ తెలిపారు. రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన వినేశ్‌.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. హర్యానాలోని జులనా స్థానం నుంచి ఆమె పోటీకి సిద్దమయ్యారు.

Show comments