ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేఖంగా మరోసారి దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ‘బైబై మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. గత ఎనిమిదేళ్ల పాలనలో మోదీ అవలంభిస్తున్న విధానాలపై నెటిజెన్లు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై కూడా నెటిజెన్లు స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్నిపథ్ పై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఉద్యోగాలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీలపై యూటర్న్ తీసుకుందని.. ద్రవ్యోల్భనం, దేశ జీడీపీ మొదలైన విషయాల్లో భారత్ తిరోగమనంలో ఉందని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైబై మోదీ హాష్ ట్యాగ్ కు మద్దతుగా మోదీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల టీఆర్ఎస్ పార్టీ, కార్యకర్తలు ఇలాగే ‘ మోడీ మస్ట్ రిజైన్’ హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దేశంలోని నెటిజెన్లు ఈ హాష్ ట్యాగ్ పై స్పందించారు. ఆ సమయంలో కూడా ఈ హాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచింది. శ్రీలంక పవర్ ప్రాజెక్ట్ వ్యవహారంలో అదానీకి మోదీ మద్దతు పలికారని.. శ్రీలంక పవర్ ప్రాజెక్ట్ అదానీకి వచ్చేలా అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై మోదీ ఒత్తడి తెచ్చారని అక్కడి అధికారి వెల్లడించడంతో, అదానీకి మోదీ మద్దతు ఇస్తున్నారనే విషయంపై ఈ హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.
గతంలో మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా కూడా ‘‘ గోబ్యాక్ మోడీ’’ హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అయింది. తమిళనాడులో వివిధ డెవలప్మెంట్ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం మోదీ చెన్నై వెళ్లిన సందర్భంలో మోదీకి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు గో బ్యాక్ మోదీ హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.