Site icon NTV Telugu

Business Headlines 24-02-23: ఇక.. హైడ్రోజన్ బస్సులు. మరిన్ని వార్తలు

Business Headlines 24 02 23

Business Headlines 24 02 23

Business Headlines 24-02-23

BWA-తెలంగాణ ఒప్పందం

తెలంగాణ రాష్ట్రాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానంలో అగ్ర స్థానంలో నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. వెబ్‌3 టెక్నాలజీ సంస్థ భారత్‌ వెబ్‌3 అసోసియేట్స్‌.. BWAతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం BWA కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో సదస్సులు, ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తద్వారా.. వెబ్‌3 టెక్నాలజీని విస్తరించేందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. ఈ టెక్నాలజీలపై పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించే సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుంది.

క్రిప్టోలను కట్టడి చేయాల్సిందే

జీ20 దేశాల ఆర్థిక మంత్రుల మరియు కేంద్ర బ్యాంక్‌ గవర్నర్ల రెండు రోజుల సమావేశాలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. అమెరికా, జపాన్‌ వంటి పలు దేశాల ఆర్థిక మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీల కట్టడికి అంతర్జాతీయంగా నియమనిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ కరెన్సీలను కంట్రోల్‌ చేయకపోతే ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిర్మలా సీతారామన్‌ మరో 10 ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొననున్నారు.

‘మేఘా’ హైడ్రోజన్ బస్సులు

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌.. హైడ్రోజన్‌ బస్సులను తయారుచేయనుంది. ఈ మేరకు కావాల్సిన టెక్నాలజీని రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి తీసుకుంది. ఈ సాంకేతికత సాయంతో ఒక హైడ్రోజన్‌ బస్సును రూపొందించి ఆవిష్కరించింది. ఇందులోని హైడ్రోజన్‌ ట్యాంక్‌ను పావు గంటలో పూర్తిగా నింపొచ్చు. ఈ వాయువు సాయంతో బస్సు 400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ బస్సు సుమారు 12 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో కనీసం 32 నుంచి గరిష్టంగా 49 వరకు సీట్లు ఉన్నాయి. ఏడాది వ్యవధిలో ఈ బస్సుల వాణిజ్య ఉత్పత్తిని చేపట్టి దేశంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తేనుంది.

బడ్జెట్‌పై దువ్వూరి అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని తప్పుపట్టారు. ఈ అంశం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు పది లక్షల మందికి కొత్తగా ఉపాధి అవసరం కాగా కనీసం సగం మందికి కూడా లభించడంలేదని కుండబద్ధలు కొట్టారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే పథకాల రూపకల్పనలో బడ్జెట్‌ ఫెయిలైందని తేల్చిచెప్పారు. ఆర్థిక వృద్ధి జరిగినంత మాత్రాన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని భావించటం తప్పు అని స్పష్టం చేశారు.

వందే భారత్‌ రేసులో ‘మేధా’

వందే భారత్‌ రైళ్ల విడి భాగాల తయారీకి సంబంధించిన బిడ్డింగ్‌ ప్రక్రియలో హైదరాబాద్‌ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్‌ పాల్గొంది. వంద రైళ్లకు కావాల్సిన స్పేర్‌ పార్ట్స్‌ను అల్యూమినియంతో రూపొందించే ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియన్‌ రైల్వేస్‌ తొలిసారిగా రైళ్ల తయారీకి అల్యూమినియం విడి భాగాలను వినియోగిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్‌ బిడ్‌లను నిన్న గురువారం ఓపెన్‌ చేశారు. ఫైనాన్షియల్‌ బిడ్‌లను త్వరలో ఆహ్వానించనున్నారు. ఆగస్టు నాటికి కనీసం 75 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

అమెరికాలో అపారవకాశాలు

ఇండియాలోని లీడింగ్‌ జ్యూలరీ రిటైల్‌ బ్రాండ్లలో ఒకటైన తనిష్క్‌.. అగ్ర రాజ్యం అమెరికాలో తొలి ఔట్‌లెట్‌ని ప్రారంభించి నెల రోజులైంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. యునైటెడ్‌ స్టేట్స్‌లో తమ సంస్థకే కాకుండా ఇతర ఇండియన్‌ రిటైల్‌ బ్రాండ్లకు కూడా అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉండటంతోపాటు వాళ్ల తలసరి ఆదాయం సైతం భారీగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పారు. మన దేశం, మన కల్చర్‌, మన ఉత్పత్తులపై ఇండియన్లకు ఆసక్తి ఉండటం కూడా దీనికి దోహదపడిందని తెలిపారు.

Exit mobile version