Site icon NTV Telugu

Business Headlines 01-03-23: టీవీఎస్‌ అపాచీ బైక్‌ 50 లక్షల యూనిట్లు సేల్‌. మరిన్ని వార్తలు

Business Headlines 01 03 23

Business Headlines 01 03 23

Business Headlines 01-03-23:

బీడీఎల్‌ డివిడెండ్‌ రూ.112 కోట్లు

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 112 కోట్ల రూపాయలను డివిడెండ్‌ కింద చెల్లించింది. ఈ మేరకు BDL చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ మిశ్రా నిన్న మంగళవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి చెక్‌ అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ.. ఒక్కో షేర్‌కి 8 రూపాయల 15 పైసల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. BDLలో కేంద్ర ప్రభుత్వానికి సుమారు 75 శాతం వాటా ఉండటంతో ఆ ప్రకారం డివిడెండ్‌ ఇచ్చింది. చేతి నిండా ఆర్డర్లు ఉండటంతో రానున్న రోజుల్లో మరింత ఆదాయం మరియు లాభాలు వస్తాయని తెలిపింది.

ఆర్‌బీఐ గవర్నర్‌తో బిల్‌గేట్స్‌ భేటీ

మైక్రోసాఫ్ట్‌ కోఫౌండర్‌ మరియు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ నిన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంతదాస్‌ను కలిశారు. ముంబైలోని ఆర్‌బీఐ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. ఇండియాలో పర్యటిస్తున్న బిల్‌గేట్స్‌ వివిధ రంగాల వ్యాపారవేత్తలను కలుస్తున్నారు. హెల్త్‌, ఎడ్యుకేషన్‌ మరియు ఇతర సెక్టార్లలో వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు ఆయన భారతదేశానికి వచ్చారు. ఈ మీటింగ్‌లో బిల్‌గేట్స్‌తో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చలు జరిగినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. ఆర్థిక సేవలు, పేమెంట్‌ వ్యవస్థలు, సూక్ష్మ రుణాలు, డిజిటల్‌ లోన్లు వంటి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.

మళ్లీ అగ్రస్థానానికి ఎలాన్‌ మస్క్‌

ట్వి్ట్టర్‌ మరియు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మళ్లీ ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. టాప్‌-10లో ఇండియా నుంచి ముకేష్‌ అంబానీ ఒక్కరే ఉన్నారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌టైం ఇండెక్స్‌ విడుదలైంది. ఈమధ్య కాలంలో టెస్లా షేర్ల విలువ భారీగా పెరగటంతో ఎలాన్‌ మస్క్.. బెర్నార్డ్‌ ఆర్నోను రెండో స్థానానికి పరిమితం చేశారు. జెఫ్‌ బెజోస్‌, బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌.. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో.. గౌతమ్‌ అదానీ ఘోరంగా 32వ ర్యాంక్‌కి పడిపోయారు.

మరోసారి తగ్గిన ఆర్థిక పురోగతి

మన దేశ ఆర్థిక ప్రగతి వరుసగా రెండో త్రైమాసికంలో కూడా తగ్గింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి నాలుగు పాయింట్‌ నాలుగు శాతానికే పరిమితమైంది. ఈ డేటాను జాతీయ గణాంకాల కార్యాలయం.. NSO.. నిన్న రిలీజ్‌ చేసింది. దేశ ఆర్థిక వృద్ధి అంతకుముందు సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆరూ పాయింట్‌ 3 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే. తాజా తగ్గుదలకు కారణం తయారీ రంగం సరైన పనితీరును కనబరచకపోవటమేనని పేర్కొంది. వడ్డీ రేట్లు పెరగటం మరో కారణమని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద ఏడు శాతం జీడీపీ వృద్ధి నమోదవుతుందని వివరించింది.

అపాచీ బైక్‌ 50 లక్షల యూనిట్లు

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా పురోగతి సాధిస్తున్న బ్రాండ్లలో ఒకటైన టీవీఎస్‌ అపాచీ బైక్‌.. అంతర్జాతీయంగా 50 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తిచేసింది. తొలిసారిగా 2005లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ మోడల్‌.. ప్రస్తుతం 60కి పైగా దేశాల్లో సేల్‌ అవుతోంది. టీవీఎస్‌ కంపెనీ ప్రీమియం బ్రాండ్‌ అయిన అపాచీ సిరీస్‌లో నేక్డ్‌ మరియు సూపర్‌ స్పోర్ట్స్‌ అనే రెండు కేటగిరీలు ఉన్నాయి. ఆర్‌టీఆర్‌ సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఉండగా స్పోర్ట్స్‌ విభాగంలో రెండు మోడళ్లు ఉన్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో 50 లక్షల యూనిట్ల అమ్మకాలు పూర్తికావటం పట్ల టీవీఎస్‌ కంపెనీ హర్షం వ్యక్తం చేసింది.

5 నెలల్లో.. 387 జిల్లాల్లో.. 5జీ

దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో 387 జిల్లాల్లో సంబంధిత మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ జిల్లాల్లో లక్ష బేస్‌ ట్రాన్సీవర్‌ సెంటర్లు పనిచేస్తున్నాయని టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. 200 జిల్లాల్లో ఈ మౌలిక వసతులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. దానికి మించి ప్రగతి సాధించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మన దేశం డెవలప్‌ చేసిన 4జీ, 5జీ స్టాక్‌ పట్ల 18 దేశాలు, 13 విదేశీ టెలికం సంస్థలు ఆసక్తి కనబరిచాయని వివరించారు.

Exit mobile version