నాలుగేళ్లలో మెరుగుపడ్డ ఆర్థిక రంగం
గడచిన నాలుగేళ్లలో దేశ ఆర్థిక రంగం పనితీరు స్థిరంగా మెరుగుపడింది. పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (PHDCCI) ఈ విషయాన్ని తెలిపింది. ప్రపంచంలోని టాప్ 10 ఎకానమీలపై విశ్లేషణ జరిపి ఫలితాలను వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఎకనమిక్ రెజిలియెన్స్ (ఐఈఆర్) ర్యాంక్‌లే దీనికి నిదర్శనమని పేర్కొంది. ఐఈఆర్ ర్యాంక్‌ల్లో మన దేశం 2019లో 6వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 2వ ర్యాంకుకి చేరుకోవటం విశేషం.
ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రైవేట్ వాటాల పెంపు?
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రైవేట్ వాటాల పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ లిమిట్ 10 శాతానికి మించకూడదనే రూలు ప్రస్తుతం అమల్లో ఉంది. దీంతో ఈ నిబంధనను తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలకు మార్గం సుగమం చేయనుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో (పీఎస్‌బీల్లో) బయటి పెట్టుబడులు పెరగనున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు వాటాలను సొంతం చేసుకోనున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు దారితీయొచ్చు.
7కి పైన స్థిరంగా రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో పెద్దగా మార్పు కనిపించట్లేదు. జూన్ నెలలోనూ ఏడు శాతానికి కొంచెం పైనే కొనసాగింది. ఇటీవలి కాలంలో ఆహార ధరలు గణనీయంగా పెరిగాయి. గత రెండేళ్లలో శరవేగంగా వృద్ధిచెందాయి. దీంతో ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించింది. ఆహార ఎగుమతుల పైనా ఆంక్షలను అమలుచేసింది. ఈ నేపథ్యంలో మొత్తానికి ద్రవ్యోల్బణం పాక్షికంగా అదుపులోనే ఉందని చెప్పొచ్చు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
గతవారం భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 16,150 పాయింట్ల దిగువకు వచ్చింది. దీంతో ఐటీ షేర్లు 3 శాతం లాసయ్యాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహింద్రాలు 2 శాతం నష్టాన్ని చవిచూశాయి. మరోవైపు.. 5జీ స్పెక్ట్రం వేలంలోకి గౌతమ్ అదానీ గ్రూపు కూడా ఎంటరవటంతో భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 4 శాతం నష్టపోవటం గమనార్హం.