ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత వెంకన్న 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీగా వుందన్న వ్యాఖ్యలపై మంత్రి జోగిరమేష్ స్పందించారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు రక్తంలోనే వుంది. టీడీపీ మాపై పోటీ పడి గెలిచే అవకాశమే లేదు. మేం వాళ్ళని టచ్ చెయ్యనవపరం లేదు. జనమే ఓట్లతో సమాధానం చెప్పారు. చంద్రబాబే సూసైడ్ బ్యాచ్ ను తయారు చేసి వదిలారు. న్యాయం కోసం వెళ్లిన నన్నే అప్పట్లో కొట్టించారు. అచ్చెన్నాయుడు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు మంత్రి జోగి రమేష్.
మంత్రి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. జోగి రమేషుకు మంత్రి పదవి ఇవ్వడం వల్లే మేం సూసైడ్ బ్యాచ్‌ను సిద్దం చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వచ్చినందుకే జోగి రమేష్ మంత్రి పదవి దక్కిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. పదవుల కోసం ప్రతిపక్షం మీద దాడి చేయాలనే భావన వైసీపీ నేతల్లో కన్పిస్తోంది. వైసీపీ తీరు వల్లే మేం అన్నింటికీ సిద్దపడుతున్నాం అన్నారు.
వైసీపీ వల్లే చంపడానికైనా.. చావడానికైనా రెడీగా ఉండేలా సూసైడ్ బ్యాచును సిద్దం చేసుకున్నాం. చంద్రబాబు ఇంటి మీదకొచ్చినా.. పార్టీ కార్యాలయం మీద దాడి చేసినా.. ఇష్టానుసారం తిట్టినా నో పోలీస్. నా వ్యాఖ్యలపై పోలీసులు కేసులు పెడితే అన్నింటికీ సిద్దంగానే ఉన్నాం. చంద్రబాబుపై దాడి చేయడానికి వస్తే చేతులు కట్టుకుని కూర్చోమంటారా..? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
Read Also: Budda Venkanna: చంద్రబాబును తిట్టేవారికి హెచ్చరిక.. 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధం