అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగేవారిని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎవరైనా అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న హితవు పలికారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయని వైసీపీ నేతలు కలలు కంటున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అటు ప్రతి మనిషిలో కృతజ్ఞత అనేది ఉండాలని.. పార్టీలో తనకు, నాగుల్ మీరాకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని బుద్ధా వెంకన్న తెలిపారు. చంద్రబాబు కటౌట్‌కు పంచామృతాలతో పాలాభిషేకం చేసినట్లు వివరించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా 500 మందికి చీరలు పంపిణీ చేశామన్నారు.
జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నేత నాగుల్ మీరా ఆరోపించారు. జగన్ వైఫల్యాలపై ప్రజలు విసిగి పోయారని.. చంద్రబాబు పాలన మళ్లీ రావాలని అందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ముందు చూపు వల్లే ఉమ్మడి ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. నమ్మి ఓట్లేస్తే జగన్ ప్రజలను నట్టేట ముంచాడని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని నాగుల్ మీరా అన్నారు.