NTV Telugu Site icon

Team India: మంచి ‘బలగం’ ఉంది.. మరో పదేళ్లు ఢోకా లేదు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

Vvs Laxman

Vvs Laxman

అంతర్జాతీయ క్రికెట్లో మరో పదేళ్లు భారత జట్టుకు ఎలాంటి డోకా లేదని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (బీసీఈ) చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. మరో పదేళ్లు భారత్‌ ఆధిపత్యం చెలాయించడానికి కావాల్సినంత మంది ఆటగాళ్లు దేశంలో ఉన్నారన్నారు. పురుషుల్లోనే కాదు మహిళల క్రికెట్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం బీసీఈ శిక్షణ శిబిరంలో భారత మహిళల జట్టు తీవ్రంగా శ్రమించిందని లక్ష్మణ్‌ తెలిపారు.

బీసీఈ కొత్త సెంటర్‌ను ప్రారంభించిన నేపథ్యంలో బెంగళూరులో వీవీఎస్‌ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘రాబోయే 10 ఏళ్లు దేశం గర్వించేలా చేసే చాలామంది ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. ఈ విషయాన్ని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. పురుషుల్లోనే కాదు మహిళల క్రికెట్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అంతటి ప్రతిభ కలిగి ఉండటం మన అదృష్టం. ప్రతి ఏడాది కనీసం రెండు ఎ జట్టు పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితులపై అవగాహన, అనుభవం సంపాదించేందుకు ఈ టూర్స్ ఉపయోగపడతాయి’ అని లక్ష్మణ్ చెప్పారు.

Also Read: Jammu And Kashmir Polls: తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది అభ్యర్థులు పోటీ!

‘టీ20 ప్రపంచకప్‌ కోసం బీసీఈ శిక్షణ శిబిరంలో భారత మహిళా జట్టు తీవ్రంగా శ్రమించింది. మన అమ్మాయిల సాధన, నిబద్ధత, పట్టుదలకు సాటిలేదు. వాళ్లు సన్నద్ధమైన విధానం నాకు గర్వంగా అనిపించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ కప్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని వీవీఎస్‌ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 4న దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో భారత్ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.