NTV Telugu Site icon

West Bengal: టీఎంసీ నాయకుడు దారుణ హత్య.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత

Bengal

Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం దక్షిణ 24 పరగణాస్‌ జిల్లాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. జాయ్‌నగర్‌లోని తన ఇంటి వద్దే సైఫుద్దీన్ లస్కర్ ను కాల్చి చంపారు. దీంతో టీఎంసీ నాయకులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశారు. అంతేకాకుండా.. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. అధికార తృణమూల్, ప్రతిపక్ష సీపీఎం మధ్య రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. లస్కర్ జాయ్‌నగర్‌లోని బముంగాచి ప్రాంతంలో తృణమూల్ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

అయితే లస్కర్ మద్దతుదారులు అతని హత్యలో ప్రమేయం ఉందని అనుమానించిన ఓ వ్యక్తిని పట్టుకుని, అతనిపై తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా.. అధికార పార్టీ మద్దతుదారులు ఆ ప్రాంతంలోని పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. సైఫుద్దీన్ లస్కర్ హత్య వెనుక సీపీఎం మద్దతుదారుల హస్తం ఉందని స్థానిక తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి ఆ ఆరోపణలను ఖండించారు. ఈ హత్య తృణమూల్ అంతర్గత కలహాల ఫలితమే అని అన్నారు. సీపీఎంను నిందించి ప్రయోజనం లేదన్నారు. పోలీసులు సరైన విచారణ జరిపి కుట్రను ఛేదించాలని చక్రవర్తి తెలిపారు. ఇదిలా ఉంటే.. తృణమూల్‌ నేత హత్యకేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.